September 2, 2026
Explore
మూలాలు మర్చిపోతే… మీడియా విలువలు ఎక్కడ మిగులుతాయి?

మూలాలు మర్చిపోతే… మీడియా విలువలు ఎక్కడ మిగులుతాయి?

September 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఇటీవల కొన్ని శాటిలైట్ మీడియా చానళ్ల పరిస్థితిని చూస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వర్గానికి, ఒక పార్టీకి అండగా నిలిచి తమ పబ్బం గడుపుకునే వారు కొందరైతే… ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి జై కొట్టే వారు మరికొందరు.

ఎన్నో ఏళ్లుగా వాళ్లు చెప్పేది 100% కరెక్ట్ అని నమ్మిన ప్రేక్షకులు ఉన్నారు. ఎన్నికల సర్వేలు వంటి విషయాల్లో కూడా అదే నమ్మకం. కానీ డబ్బు, వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ సంబంధాల కోసం తెలిసిన నిజాలను పక్కన పెట్టి తప్పుదోవ పట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు వరుసగా 1, 2, 3, 4, 5, 6… ఇలా ర్యాంకుల్లో పోటీ పడిన చానళ్లు… జిల్లాల్లో భారీ సంఖ్యలో రిపోర్టర్లు, కెమెరామెన్లను పెట్టుకున్నాయి. కార్పొరేట్ కార్యాలయాలు, పెద్ద సంఖ్యలో సిబ్బందితో వ్యవస్థను నడిపిన సంస్థలు ఉన్నాయి.

కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది.

కొన్ని పెద్ద చానళ్లు జిల్లా స్థాయిలో సిబ్బందిని తగ్గించాయి. మరికొన్ని చోట్ల ఒకరిద్దరు రిపోర్టర్లు, కెమెరామెన్లతోనే వ్యవస్థను నడుపుతున్నాయి. ఒకప్పుడు పెద్ద సంస్థల్లో పనిచేసిన కొందరు ఇప్పుడు చిన్న చానళ్లలో అవకాశాల కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది.

ఇందులో నాకు బాధ కలిగించే అసలు విషయం పెద్ద చానళ్లు చిన్నవిగా మారుతున్నాయన్నది కాదు. మీడియా తన అసలు బలాన్ని కోల్పోతున్నదన్నదే.

మీడియా ప్రజలకు మీడియాగానే ఉండాలి.

ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే వారధిగా ఉండాలి.
ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినప్పుడు ప్రశ్నించాలి.
ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను అభినందించాల్సినప్పుడు అభినందించాలి.

కానీ ఏదో ఒక పార్టీకి వారధిగా మారకూడదు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి భజన చేసే వ్యవస్థగా కూడా మారకూడదు.

ఒకప్పుడు Fourth Estate అనే పదానికి ఉన్న గౌరవం, విలువ, భయం… 20, 30 ఏళ్ల క్రితం మీడియాకు ఉన్న ప్రభావం గుర్తు చేసుకుంటే, ఈరోజు పరిస్థితి ఎందుకు ఇలా మారిందో మనమే ఆలోచించుకోవాలి.

మూలాలు మర్చిపోయి… విలువలను గాలికి వదిలేసి… Fourth Estateను రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు తాకట్టు పెట్టిన వారి వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? అన్నది ఆలోచించాల్సిన ప్రశ్న.

ఇంకో విచిత్రమైన పరిస్థితి కూడా కనిపిస్తోంది.

ఒకప్పుడు చిన్న సంస్థలను తక్కువగా చూసిన కొందరు… ఇప్పుడు అదే చిన్న చానళ్లలో అవకాశాల కోసం దరఖాస్తులు పెట్టే పరిస్థితి రావడం చూస్తుంటే కాలం ఎంత విచిత్రంగా మారుస్తుందో అర్థమవుతోంది.

అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు.

ఎవరినైనా వారి మంచి రోజుల్లో తొక్కితే… పరిస్థితులు మారినప్పుడు వాళ్లు మర్చిపోతారని అనుకోవడం పొరపాటు.

అందుకే మన రంగంలో మార్పు రావాలి.

పెద్ద చానల్ అయినా… చిన్న చానల్ అయినా…
రిపోర్టర్ అయినా… యజమాని అయినా…

మీడియా విలువలను కాపాడటం, జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడటం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం — ఇవే అసలు విజయాలు.

ఇది ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడానికి కాదు. నేను గమనించిన పరిస్థితులపై నా అభిప్రాయం మాత్రమే.

ఇది కేవలం వినికిడి ఆధారంగా చెబుతున్న మాట కాదు… నేను గమనించిన, పరిశీలించిన పరిస్థితుల ఆధారంగా చెబుతున్న మాట. ఎవరికైనా సందేహం ఉంటే స్వయంగా పరిశీలించుకోవచ్చు…. 🇮🇳 జైహింద్

Tags: If one forgets one’s roots… where do media values ​​remain?