హెచ్‌ఐవీ కొత్త మందు వీహెచ్-499తో ఆశాజనక ఫలితాలు
తొలి మానవ పరీక్షలో వైరల్ లోడ్ గణనీయంగా తగ్గుదల
23 మందిపై నిర్వహించిన ఫేజ్-2ఏ ట్రయల్
తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదన్న పరిశోధకులు
లెనాకాపవిర్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం
తదుపరి ఫేజ్-3 పరీక్షల తర్వాతే తుది నిర్ణయం
అమరావతిముచ్చట్లు:
హెచ్‌ఐవీ చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. వీహెచ్-499 పేరుతో అభివృద్ధి చేసిన కొత్త ఔషధం తొలి మానవ క్లినికల్ పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు ఇచ్చింది. ఈ మందు హెచ్‌ఐవీ-1 వైరస్ శరీరంలో విస్తరించకుండా అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలు ‘క్లినికల్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
హెచ్‌ఐవీ వైరస్‌ను కప్పి ఉంచే క్యాప్సిడ్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని వీహెచ్-499 పనిచేస్తుంది. వైరస్ జీవించడానికి, శరీరంలో వ్యాప్తి చెందడానికి ఈ ప్రొటీన్ కీలకం. దానిపైనే ప్రభావం చూపడం ద్వారా వైరస్ పెరుగుదలను ఈ కొత్త ఔషధం అడ్డుకుంటుంది.
ఫేజ్-2ఏ క్లినికల్ ట్రయల్‌లో హెచ్‌ఐవీ-1 బారినపడిన 23 మందిని పరిశీలించారు. వీరిలో 20 మందికి వివిధ మోతాదుల్లో వీహెచ్-499 ఇవ్వగా, ముగ్గురికి ప్లాసీబో ఇచ్చారు. చికిత్స ప్రారంభానికి ముందు అందరిలోనూ వైరస్ స్థాయి ఎక్కువగానే ఉంది. అయితే వీహెచ్-499 తీసుకున్న ప్రతి ఒక్కరిలోనూ 11వ రోజుకే వైరల్ లోడ్ తగ్గింది. ఎక్కువ మోతాదు తీసుకున్నవారిలో మరింత మెరుగైన ఫలితాలు కనిపించాయి. ప్లాసీబో తీసుకున్నవారిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు.
ఈ ఔషధం సురక్షితంగానే ఉందని, ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న లెనాకాపవిర్ తరహా ఔషధంతో పోలిస్తే, శరీరంలోని సీవైపీ3ఏ4 అనే ఎంజైమ్‌తో వీహెచ్-499కు తక్కువ పరస్పర చర్యలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకేసారి అనేక మందులు వాడే రోగులకు ఇది ప్రయోజనకరంగా మారొచ్చని భావిస్తున్నారు.
అయితే ఈ మందు సాధారణ రోగులకు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది. పెద్ద ఎత్తున ఫేజ్-3 క్లినికల్ పరీక్షలు నిర్వహించి భద్రత, ప్రభావాన్ని మరింత నిర్ధారించాల్సి ఉంది. ఆ పరీక్షల్లో కూడా విజయవంతమైతే, దీర్ఘకాలం పనిచేసే హెచ్‌ఐవీ చికిత్సల్లో వీహెచ్-499 కీలక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Tags: New hope in HIV treatment: New drug succeeds in initial trial.