విద్యార్థినుల కోసం అదనపు తరగతి గదులు, డార్మిటరీ, డైనింగ్ హాల్, ప్రహరీ నిర్మాణానికి చర్యలు
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
కలికిరి ముచ్చట్లు:
కలికిరిలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలికల బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో విద్యార్థినులకు అవసరమైన అదనపు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి కలికిరిలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలికల బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వసతి సదుపాయాలు, ఇతర మౌలిక వసతులను వారు పరిశీలించారు.ప్రస్తుతం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలను 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో భాగంగా ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక్కో కోర్సులో 80 మంది చొప్పున విద్యార్థినులకు అవకాశం కల్పించనున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇంటర్మీడియట్ విద్యార్థినులకు అవసరమైన అదనపు తరగతి గదులు, డార్మిటరీ సదుపాయాలను కల్పించేందుకు పాఠశాల సమీపంలోని సీఆర్‌సీ భవనాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సొసైటీ ద్వారా రూ.40 లక్షల నిధులు మంజూరయ్యాయని, అవసరాన్ని బట్టి అదనపు నిధులను కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా పాఠశాల వెనుక భాగంలో ఉన్న సుమారు ఒక ఎకరం స్థలానికి ప్రహరీ నిర్మాణం, విద్యార్థినుల కోసం డైనింగ్ హాల్ ఏర్పాటు, పాఠశాల ముందు భాగంలోని ప్రహరీని మరింత ఎత్తు పెంచే పనులకు అవసరమైన అంచనాలను సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టరు, ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.విద్యార్థినులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతి, భోజనం, సురక్షితమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్య ప్రారంభానికి ముందే అవసరమైన మౌలిక సదుపాయాల పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఈడబ్ల్యూఐడిసి ఈఈ కరీముల్లా ఖాన్, పాఠశాల ప్రిన్సిపాల్, తాసిల్దార్, మార్కెట్ కమిటీ చైర్మన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:Upgrade of Kalikiri BC Girls’ Residential School to Intermediate Level