అమరావతిముచ్చట్లు:
BCCI Rules : దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ సంచలన మార్పులు చేసింది. ఉద్దేశపూర్వకంగా నో-బాల్ వేస్తే మ్యాచ్ మొత్తానికి బౌలింగ్ నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది. దులీప్ ట్రోఫీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు భారత క్రికెట్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.
BCCI Rules : బీసీసీఐ రాబోయే 2026-27 దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం క్రీడా నియమాల్లో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ కొత్త నిబంధనలను రూపొందించారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీతో ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ మేరకు బిసిసిఐ ఇప్పటికే అన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు సమాచారాన్ని అందించింది.
నో-బాల్ వేస్తే మ్యాచ్ మొత్తానికే బ్యాన్
నూతన నిబంధనల్లో అత్యంత కీలకమైనది Law 41.8కి చేసిన సవరణ. ఒక బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్-ఫుట్ నో-బాల్ లేదా నాన్-ల్యాండింగ్ డెలివరీ వేసినట్లు తేలితే, ఆ బౌలర్‌పై తీవ్ర చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం సదరు బౌలర్‌ను ఆ ఇన్నింగ్స్ వరకు మాత్రమే బౌలింగ్ చేయకుండా ఆపేసేవారు. కానీ కొత్త రూల్ ప్రకారం.. ఆన్-ఫీల్డ్ అంపైర్లు నిర్ణయం తీసుకుంటే, ఆ బౌలర్ ఇక ఆ మ్యాచ్ మొత్తంలో బౌలింగ్ చేయడానికి వీలుండదు.
రంజీ, ఇరానీ ట్రోఫీల్లో కొత్త ముగింపు రూల్
బహుళ రోజుల మ్యాచ్‌లు (రంజీ, ఇరానీ ట్రోఫీ) రోజువారీ ముగింపు సమయానికి సంబంధించిన నిబంధనను బిసిసిఐ సవరించింది. పాత రూల్ ప్రకారం.. రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడితే ఇన్నింగ్స్ వెంటనే ముగిసిపోయేది, మిగిలిన బంతులను బౌలింగ్ చేసేవారు కాదు. కానీ కొత్త నిబంధన (12.5.2) ప్రకారం.. చివరి ఓవర్‌లో వికెట్ పడినా కూడా ఆ ఓవర్‌ను పూర్తిగా పూర్తి చేయాల్సిందే. ఆట సహజమైన ప్రవాహానికి అడ్డంకి కలగకుండా ఉండేందుకే ఈ మార్పు చేసినట్లు వివరించారు.
ఆఖరి ఇన్నింగ్స్‌లో డిక్లరేషన్‌కు నో
మ్యాచ్ ఫలితాలను కావాలని మార్చేందుకు ప్రయత్నించే పద్ధతికి చెక్ పెడుతూ బిసిసిఐ రూల్ 15.2ను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. మ్యాచ్‌లోని ఆఖరి ఇన్నింగ్స్‌ను జట్లు ఇకపై డిక్లేర్ చేయడం కానీ, లేదా వదిలేయడం కానీ చేయకూడదు. ఈ నిర్ణయం వల్ల దేశవాళీ మ్యాచ్‌ల పోటీ తత్వం, విశ్వసనీయత మరింత పెరుగుతుందని బోర్డు భావిస్తోంది.
కోచ్‌లకు ఎంట్రీ.. వికెట్ కీపర్లకు ఊరట
మరికొన్ని కీలక మార్పులలో భాగంగా, వన్డే మ్యాచ్‌ల డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్‌లు గ్రౌండ్‌లోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. దీనివల్ల ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి మధ్య మెరుగైన కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. అలాగే వికెట్ కీపర్ల నిబంధన (27.3)ను సులభతరం చేశారు. బౌలర్ రన్-అప్ ప్రారంభించినప్పటి నుంచి గ్లౌవ్స్‌ను స్టంప్స్ వెనుకే ఉంచాలనే పాత నిబంధనను సవరించి, బంతిని విసిరే సమయంలో గ్లౌవ్స్ స్టంప్స్ వెనుక ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ కొత్త మార్పులపై అంపైర్లు, మ్యాచ్ రెఫరీలకు ముందస్తు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
Tags: BCCI brings new rules.. Intentional no-ball will result in ban for the entire match