రాయచోటి ముచ్చట్లు:
పోలీసు శాఖ క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి వినతిపత్రం అందజేసిన పోలీసు శాఖ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని పోలీసు శాఖకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం జారీ చేసిన G.O.Ms.No.45లో ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న పోస్టులను మల్టీ-జోనల్ క్యాడర్‌గా వర్గీకరించిన నేపథ్యంలో, అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Inspector of Police) పోస్టును కూడా మల్టీ-జోనల్ క్యాడర్‌గా ప్రకటించడం సముచితమని మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు.
అయితే, G.O.Ms.No.103 ద్వారా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టును జోనల్ క్యాడర్‌గా వర్గీకరించారని, పరిపాలనా సౌలభ్యం, సిబ్బంది నిర్వహణలో సమర్థత, క్యాడర్ వ్యవస్థలో ఏకరూపత దృష్ట్యా ఇన్‌స్పెక్టర్ పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌గా పునర్వర్గీకరించాలని కోరారు.
అదేవిధంగా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌కు బదులుగా స్టేట్ క్యాడర్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విధుల నిర్వహణ, పరిపాలనా బాధ్యతలు, అవసరమైన చోట సేవలు అందించే సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేయాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.
అనంతరం, G.O.Ms.No.103లో అవసరమైన సవరణలు చేసి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌గా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పోస్టును స్టేట్ క్యాడర్‌గా ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , పోలీసు శాఖ ప్రతినిధులు తెలిపిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Tags: Police Department submits representation to Minister Ramprasad Reddy.