July 21, 2026
Explore
పేదల ఇళ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా: 9.2 లక్షల మంది అర్హుల గుర్తింపు.

పేదల ఇళ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా: 9.2 లక్షల మంది అర్హుల గుర్తింపు.

July 21, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) పథకం కింద ఇళ్ల నిర్మాణాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేస్తూ అర్హుల తుది జాబితాను ఖరారు చేసింది.

ఈ పథకం కింద గతంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం వచ్చిన 10.42 లక్షల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత పారదర్శకంగా పరిశీలించారు. అనర్హులను తొలగించి, ప్రాథమికంగా 9.2 లక్షల మందిని ఇళ్లకు అర్హులుగా తేల్చారు.

ఈ జాబితాలో లబ్ధిదారులను వారి అవసరాల ప్రాతిపదికన రెండు కేటగిరీలుగా విభజించారు..

సొంత స్థలం ఉన్నవారు..

ఇల్లు కట్టుకోవడానికి అప్పటికే సొంత స్థలం ఉండి, ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారు అత్యధికంగా 7.18 లక్షల మంది ఉన్నారు.

స్థలం లేని నిరుపేదలు..

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనున్న 3 సెంట్ల నివాస స్థలం కోసం మరో 2.02 లక్షల మంది వేచి చూస్తున్నారు.

త్వరలోనే ఇళ్ల కేటాయింపులు జాబితా ఖరారు కావడంతో నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా ఇళ్ల స్థలాలు, నిర్మాణ నిధుల పంపిణీ చేపట్టనున్నారు.

Tags: Alliance government gives the green signal for the construction of houses for the poor; 9.2 lakh eligible beneficiaries identified.