లక్షలాది మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.13,000 జమ
సైబర్ నేరగాళ్ల నకిలీ లింకులతో జాగ్రత్త: పోలీస్ అధికారుల హెచ్చరిక..
అమరావతిముచ్చట్లు:
రాష్ట్రంలోని పేద విద్యార్థుల తల్లులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం నిధుల పంపిణీ ప్రక్రియ రేపటి (జులై 22) నుంచి షురూ కానుంది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ కానుంది. ఈ నెల 22 నుంచి 24వ తేదీల లోపు దశలవారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ఈ నిధులు చేరనున్నాయి.
అప్రమత్తంగా ఉండాల్సిందే.
ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు ‘తల్లికి వందనం’ పేరుతో పంపిణీ చేసే అనుమానాస్పద లింకుల పట్ల లబ్ధిదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు. “మీ ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి ” లేదా ” వెంటనే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి” అంటూ మొబైల్ ఫోన్లకు వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. వాటిని క్లిక్ చేస్తే అకౌంట్లలో ఉన్న సొమ్ము మొత్తం సైబర్ దొంగల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు.
అధికారుల కీలక సూచనలు
మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఏటీఎం పిన్, ఆధార్ నంబర్, ముఖ్యంగా ఓటీపీ (OTP) ల వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దు.
నకిలీ లింకులు నమ్మొద్దు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఎటువంటి లింకులపైనా క్లిక్ చేయకూడదు.
పథకం నిధుల జమలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఆందోళన చెందకుండా నేరుగా మీ గ్రామ/వార్డు సచివాలయాన్ని లేదా స్కూల్ ప్రధానోపాధ్యాయులను కలిసి నివృత్తి చేసుకోవాలి. లబ్ధిదారులు ఎవరూ దళారులను నమ్మవద్దని, ప్రభుత్వ అధికారిక ప్రక్రియ ద్వారానే పారదర్శకంగా నగదు బదిలీ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Tags: ‘Thalliki Vandanam’ – Cash to be credited to accounts starting tomorrow!