అమరావతిముచ్చట్లు:
ఏపీలో పేదల ఇళ్లపై ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY Gramin) పథకం కింద గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హుల జాబితాను ఖరారు చేసింది
రాష్ట్రంలోని జిల్లాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై-గ్రామీణ్ పథకం కింద ఇళ్లకు గతంలో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో ప్రతీ జిల్లాల్లోనూ భారీ ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 42 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు తాజాగా 9.2 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో మళ్లీ రెండు కేటగిరీల వారు ఉన్నారు. తమకు అప్పటికే స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం సాయం కోరుతున్న వారు, అలాగే ఇంటి స్థలం కూడా లేకుండా ఇల్లు కావాలని కోరుతున్న వారు.
ఇందులో స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం సాయం కోరుతున్న వారే అత్యధికంగా 7.18 లక్షల మంది ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఇస్తానన్న 3 సెంట్ల స్థలం కోసం ఎదురుచూస్తున్న వారు మరో 2.02 లక్షల మంది ఉన్నారు. వీరి దరఖాస్తుల్ని పరిశీలించిన ప్రభుత్వం అర్హుల్ని ఖరారు చేసింది. వీరికి కేంద్రం ఇప్పటికే కేటాయించిన లక్ష ఇళ్లలో ముందుగా కేటాయింపులు చేస్తారు. మిగిలిన వారికి త్వరలో కేంద్రం నుంచి అనుమతి తీసుకుని కేటాయిస్తారు. అలాగే ఇళ్ల కేటాయింపులో ముందుగా ఒంటరి మహిళలు, ఆ తర్వాత వితంతువులు, దివ్యాంగులు ఇలా కేటాయింపులు చేస్తారు.
Tags; Alliance government shares good news regarding homes for the poor in AP villages.