తిరుపతి ముచ్చట్లు:
- “
- జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిరంతరంగా డ్రగ్స్‌పై దండయాత్ర–2.0కు మరింత వేగం
- అవగాహన – గుర్తింపు – కఠిన చర్యలు – పునరావాసం అనే నాలుగు దిశల్లో తిరుపతి జిల్లా పోలీసుల సమగ్ర కార్యాచరణ.
- రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిని దశలవారీగా కవర్ చేస్తూ ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు.
- పారిశ్రామిక ప్రాంతాలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం.
- బయోచెక్ కిట్లతో శాస్త్రీయ పరీక్షలు – గంజాయి వినియోగదారుల గుర్తింపు.
- సరఫరా వ్యవస్థపై కఠిన చర్యలు – వ్యసనానికి గురైన వారికి కౌన్సిలింగ్, పునరావాసం.
- ప్రజల సహకారంతో గంజాయి రహిత తిరుపతి జిల్లా లక్ష్యంగా పోలీసు శాఖ ముందడుగు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆదేశాలు, అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ “డ్రగ్స్‌పై దండయాత్ర–2.0” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో పారిశ్రామిక ప్రాంతాలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాలు, యువత ఎక్కువగా ఉండే ప్రాంతాలను దశలవారీగా కవర్ చేస్తూ ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్, పునరావాస చర్యలను సమన్వయంతో అమలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకపురం గ్రామ సమీపంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గాజులమాండ్యం సీఐ శ్రీ ఎం. మంజునాథ రెడ్డి, ఎస్‌ఐ ఎస్. హరీష్ మరియు పోలీసు సిబ్బంది ఆధునిక బయోచెక్ కిట్ల సహాయంతో గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, గంజాయి అనేది కేవలం ఒక మాదకద్రవ్యం మాత్రమే కాకుండా యువత భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, సమాజ శాంతిభద్రతలను దెబ్బతీసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. గంజాయి సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడంతో పాటు, వ్యసనానికి గురైన యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, గతంలో గంజాయి కేసుల్లో నమోదైన నిందితులు, విక్రేతలు, వినియోగదారులపై నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు. బయోచెక్ పరీక్షల ద్వారా గంజాయి వినియోగదారులను శాస్త్రీయంగా గుర్తించి, వారి ద్వారా సరఫరా వ్యవస్థలోని ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ లింకులను వెలికితీసి ప్రధాన నిర్వాహకులు, మధ్యవర్తులు, విక్రేతలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
వ్యసనానికి గురైన యువతను శిక్షించడం కంటే వారిని వ్యసన బారినుంచి బయటపడేలా చేయడం కూడా పోలీసు శాఖ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని అధికారులు తెలిపారు. తల్లిదండ్రుల సమ్మతితో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, పాపానాయుడుపేటలోని RASS పునరావాస కేంద్రం, స్విమ్స్, రుయా ఆసుపత్రుల డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స, పునరావాస సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం విద్య, ఉపాధి, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా యువతను నేరాల వైపు నెట్టివేసే ప్రమాదం ఉందని పోలీసులు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ఉపాధ్యాయులు, పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు పోలీసు శాఖతో కలిసి పనిచేయాలని కోరారు.
అలాగే తమ పరిసరాల్లో గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు.
- జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, సందేశం ఇస్తూ… గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలు, వినియోగం వంటి ప్రతి అంశంపై రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. *ఈ లక్ష్యంతో చట్ట అమలు, అవగాహన, శాస్త్రీయ గుర్తింపు, పునరావాసం అనే నాలుగు దిశల్లో సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
- అదే సమయంలో వ్యసనానికి గురైన యువతను సమాజంలో తిరిగి గౌరవప్రదమైన జీవితానికి తీసుకురావడానికి కౌన్సిలింగ్, డీ-అడిక్షన్, పునరావాస కార్యక్రమాలను కూడా సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
- మాదకద్రవ్యాల నిర్మూలన అనేది కేవలం పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదు. ప్రతి తల్లిదండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి పారిశ్రామిక సంస్థ, ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి బాధ్యతగల పౌరుడు ఇందులో భాగస్వామి కావాలి. ప్రజల సహకారంతో తిరుపతి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. యువతను రక్షించడం అంటే మన సమాజ భవిష్యత్తును రక్షించడమే, అని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, పిలుపునిచ్చారు.
- ఈ కార్యక్రమంలో గాజులమాండ్యం సీఐ ఎం. మంజునాథ రెడ్డి, ఎస్‌ఐ ఎస్. హరీష్, ఇతర పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:”Let us safeguard the future of the youth… let us build a cannabis-free society.”