రూ.కోటి విలువైన బంగారం మాయం, అప్రైజర్ అరెస్ట్
789 గ్రాముల బంగారం స్థానంలో 589 గ్రాముల నకిలీ నగలు.. కాకినాడ జీజీహెచ్ శాఖలో వెలుగుచూసిన మోసం
కాకినాడ ముచ్చట్లు:
కాకినాడ నగరంలోని జీజీహెచ్ ప్రాంగణంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం వెలుగుచూసింది. సుమారు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ అక్రమంగా స్వాహా చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ శాఖలో వైద్యులు, నర్సులు, మినిస్టీరియల్ సిబ్బంది సహా పలువురు ఖాతాదారులు తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు పొందారు. గోల్డ్ అప్రైజర్‌గా కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామానికి చెందిన నవర సూరిబాబు పనిచేస్తున్నాడు. ఖాతాదారులు తీసుకొచ్చిన బంగారాన్ని పరిశీలించి, బ్యాంక్ మేనేజర్ సమక్షంలో లాకర్‌లో భద్రపరిచే బాధ్యత అతనిదే.
ఇటీవల కొందరు రుణగ్రహీతలు తమ రుణాలను పూర్తిగా చెల్లించి బంగారం తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు, అప్రైజర్ వివిధ కారణాలు చెబుతూ ఆలస్యం చేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు రికార్డులను పరిశీలించారు.
పరిశీలనలో రికార్డుల ప్రకారం 789 గ్రాముల బంగారం ఉండాల్సి ఉండగా, లాకర్‌లో కేవలం 589 గ్రాముల నగలు మాత్రమే ఉన్నట్లు, అవి కూడా నకిలీవిగా గుర్తించినట్లు సమాచారం.
దీంతో బ్యాంక్ మేనేజర్ యాల నరసింహ భాను అభిరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోల్డ్ అప్రైజర్ నవర సూరిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags; Massive gold scam at Bank of Baroda…