హైదరాబాద్ ముచ్చట్లు:
దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో భార్యామణులు భర్తలను హతమార్చుతున్న కథనాలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. పతియే ప్రత్యక్ష దైవంగా భావించే మనదేశంలో రోజుకో ప్రాంతంలో భర్తను దారుణ హత్యలకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కిరాతక ఉదంతం వెలుగుచూసింది
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హతమార్చిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సుమారు ఎనిమిది నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
భర్తను హత్య చేసి, మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దులో పూడ్చిపెట్టిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, మియాపూర్‌కు చెందిన వెంకటేశ్ (45) గతేడాది నవంబర్‌లో అదృశ్యమయ్యాడు. దీనిపై అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రాథమిక విచారణలో ఎలాంటి పురోగతి లభించకపోవడంతో, ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు కాల్ డేటాను నిశితంగా పరిశీలించారు.
సదరు మహిళ తరచూ ఒక వ్యక్తితో ఫోన్‌లో సంభాషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెల్లడైంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్త వెంకటేశ్‌ను హత్య చేసి, మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు నిందితురాలు అంగీకరించింది. ఈ మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు, మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
Tags: She murdered her husband and buried him on the Maharashtra border… Mystery solved after eight months.