జలధార పనులు ఆగస్టు 7లోగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లి ముచ్చట్లు:
జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్), ఇరిగేషన్, ఉపాధి హామీ, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్ తదితర ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల్లో ఇంకా ప్రారంభం కాని (Not Started) పనులపై ప్రత్యేక దృష్టి సారించి వాటి స్థితిగతులను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, బీటీ మెటీరియల్ సరఫరాలో జాప్యం లేకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ భవనాలను ప్రాధాన్యత ఆధారంగా వర్గీకరించి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్, 15వ ఆర్థిక సంఘం తదితర నిధులతో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రాల భవనాలు, రాయచోటిలో నిర్మాణంలో ఉన్న వన్ స్టాప్ సెంటర్, మదనపల్లిలో ప్రతిపాదిత జిల్లా పంచాయతీరాజ్ రిసోర్స్ సెంటర్ (డీపీఆర్‌సీ) భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. డీపీఆర్‌సీ భవనంలో సుమారు 200 మందికి సరిపడే సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
గ్రామీణ నీటి సరఫరా శాఖ పనులపై సమీక్షిస్తూ అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పూర్తి చేయాలని, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను ఆగస్టు నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని, నీటి రవాణా మొత్తం ఆన్‌లైన్ ట్రాకింగ్ విధానంలో నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. గ్రామీణ నీటి సరఫరా గ్రిడ్‌కు సంబంధించిన భూసేకరణ, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇరిగేషన్ శాఖ పనులపై సమీక్షిస్తూ జలధార–100 రోజుల కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన అన్ని పనులను ఆగస్టు 7లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 8లోగా అన్ని పనులకు సంబంధించిన ఒప్పందాలు పూర్తి చేసి వెంటనే గ్రౌండింగ్ చేపట్టాలని, పూర్తయిన పనులకు ఎం-బుక్ నమోదును పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తక్కువ వర్షపాతం నమోదైన కరువు ప్రభావిత మండలాల్లో చేపట్టిన నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతి డివిజన్‌కు చెందిన డీఈలు తమ పరిధిలోని పనుల పురోగతిపై సమగ్ర స్థితిగతుల నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పథకం కింద మదనపల్లి మండలంలో ప్రగతిలో ఉన్న 29 సప్లై ఛానల్ పనులను ఈ నెల 10లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్ శాఖల పరిధిలో చేపట్టిన పనులు, పూర్తయిన పనులు, ప్రగతిలో ఉన్న పనులపై సమీక్షించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.ఈ సమావేశంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags: Pending engineering works must be expedited and completed within the stipulated deadline.