రూ.20,000 జరిమానా..
తీర్పు వెలువరించిన హిందూపురం సెషన్స్ కోర్టు…
నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్,
హిందూపురం ముచ్చట్లు:
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం శాంతేబీదనూరు గ్రామంలో 16-06-2023న జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయి సురేష్ అలియాస్ సూరికి హిందూపురం సెషన్స్ కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
కేసు వివరాలు
బాధితుడు చంద్రశేఖర్ కు తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ముద్దాయి సురేష్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో 16-06-2023 సాయంత్రం సుమారు 7:45 గంటలకు బాధితుడిపై కత్తితో దాడి చేసి తొడ మరియు ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలు కలిగించాడు. రక్తస్రావంతో గాయపడిన చంద్రశేఖర్‌ను మొదట హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై బాధితుని తల్లి కరగాసం పార్వతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.132/2023గా కేసు నమోదు చేసి భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 307 కింద దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను సేకరించి దర్యాప్తును పూర్తి చేసి 08-09-2023న కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనంతరం కేసు PRC No.48/2023గా విచారణకు స్వీకరించబడింది.
విచారణలో సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన హిందూపురం సెషన్స్ న్యాయస్థానం ముద్దాయిని దోషిగా నిర్ధారిస్తూ 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధించింది.
ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి న్యాయస్థానంలో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేందుకు కృషి చేసిన దర్యాప్తు అధికారులు సీఐ ఆంజనేయులు, ఎస్సై ఆజాద్ భాష, కోర్టు మానిటరింగ్ సీఐ ఇస్మాయిల్, ప్రభుత్వ అభియోగ అధికారి (పీపీ) గోపాలకృష్ణ, కోర్టు మానిటరింగ్ విభాగం హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములులను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అభినందించారు.జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నేరం చేసిన నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
Tags: Accused sentenced to three years of rigorous imprisonment in attempted murder case.