June 8, 2026
Explore
ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ దొంగతనం కేసు ఛేదనం

ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ దొంగతనం కేసు ఛేదనం

June 8, 2026 | Andhra Pradesh

: 5 రోజుల్లోనే నిందితుల అరెస్ట్ – రూ.17.68 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

అనకాపల్లి ముచ్చట్లు:


​అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం, ఉపమాక గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తేదీ.02.06.2026 రాత్రి (తేదీ 03.06.2026 తెల్లవారుజామున సుమారు 01:00 గంటల సమయంలో) భారీ దొంగతనం జరిగింది. ముఖాలకు మాస్కులు ధరించిన ఇద్దరు దొంగలు తొలుత కొండపై దొంగతనానికి ప్రయత్నించి, వీలుకాకపోవడంతో కిందకు దిగి ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడి ముందున్న ప్రధాన హుండీతో పాటు, ఆండాళమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న హుండీని కట్టర్‌తో కట్ చేసి, భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకలతో పాటు రూ.1,20,000/- కి పైగా నగదును దొంగిలించారు.

​ఈ ఘటనపై టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైం.నం. 124/2026, U/s 305(a), 331(4) BNS కింద కేసు నమోదు చేయబడింది.

మెరుపు వేగంతో దర్యాప్తు – నిందితుల అరెస్ట్:
​ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి ఇన్‌స్పెక్టర్ మురళి, నక్కపల్లి రూరల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, మరియు కోటవురట్ల, పాయకరావుపేట, ఎస్.రాయవరం ఎస్ఐలతో ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు.
​ఈ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు మరియు విశ్వసనీయ సమాచారాన్ని సేకరించాయి.

ఇందులో భాగంగా తేదీ 07.06.2026 న ఉద్దండపురం బస్ స్టాప్ వద్ద ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా, తామే ఈ చోరీకి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు.

అరెస్టు చేయబడిన నిందితుల వివరాలు:
కసిరెడ్డి శ్రీహరి (వయస్సు 22), తండ్రి: అప్పారావు, వృత్తి: వెల్డింగ్ పని, నివాసం: రేవల్ల కొత్తూరు గ్రామం, నక్కపల్లి మండలం.
గంట్యాడ చిన్న (వయస్సు 23), తండ్రి: అప్పారావు, వృత్తి: వెల్డింగ్ పని, నివాసం: రేబాక గ్రామం, నక్కపల్లి మండలం.
స్వాధీనం చేసుకున్న సొత్తు మరియు సామాగ్రి:
​నిందితుల నుంచి దొంగిలించబడిన వస్తువులను మరియు నేరానికి ఉపయోగించిన సామాగ్రిని పోలీసులు పూర్తిగా రికవరీ చేశారు.

స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ పరిమాణం / విలువ

  1. దొంగిలించిన నగదు రూ.2,38,078 /-
  2. బంగారం కానుకలు 56 గ్రాములు (విలువ సుమారు రూ.8,28,800/- )
  3. వెండి కానుకలు 02 కేజీల 600 గ్రాములు (విలువ సుమారు రూ.7,02,000/- )
    మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.17,68,000/-

ఇతర సామాగ్రి: నేరానికి ఉపయోగించిన కత్తి, పట్టకారు, కట్టర్, చేతి గ్లోవ్స్ మరియు నేరం చేసే సమయంలో నిందితులు ధరించిన మెరూన్ కలర్ టీ-షర్ట్, నైట్ ప్యాంట్లు, వైట్ స్లిప్పర్స్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు:
​ఘటన జరిగిన కేవలం 5 రోజుల వ్యవధిలోనే కేసును అత్యంత చాకచక్యంగా దర్యాప్తు చేసి, నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వంద శాతం రికవరీ సాధించిన డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, సిఐలు మురళి, రామకృష్ణ, అప్పలనాయుడు మరియు ప్రత్యేక బృందాల్లోని ఎస్ఐలు సన్నీబాబు, సాహిబా అంజుమ్, మహమ్మద్ అలీ షరీఫ్, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులను అందజేశారు.

ఆలయాల్లో మరింత భద్రతకు ఆదేశాలు:
​ఈ చోరీ ఘటనను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.
​అన్ని ఆలయాల్లో రాత్రి వేళల్లో పోలీసు గస్తీ (పెట్రోలింగ్) పెంచాలని సూచించారు.
​దేవాలయాల యాజమాన్యాలు, దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఆలయ ప్రాంగణాల్లో హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నైట్ వాచ్‌మెన్‌ల నియామకం మరియు హుండీల భద్రతకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు (ఐరన్ గ్రిల్స్ వంటివి) చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags:Theft case at Upamaka Sri Venkateswara Swamy temple hundi solved.