May 29, 2026
Explore
గోకులానందుడి రూపంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

గోకులానందుడి రూపంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

May 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

చిన్నశేషవాహనంపై ఆధ్యాత్మిక మహోత్సవం

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు శ్రీ వేణుగోపాల కృష్ణుడి అలంకారంలో ఐదు తలల చిన్నశేష వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు.ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన ఈ వాహనసేవలో భక్తి పారవశ్యం అలుముకుంది.వేణునాదంతో గోపికామనసులను హరించిన శ్రీకృష్ణుని రూపంలో కల్యాణ శ్రీనివాసుడు చిన్నశేషునిపై విహరించగా భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి “గోవిందా… గోవిందా…” నామస్మరణతో ఆలయ వీధులను మార్మోగించారు.భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాలు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శోభాయమానం చేశాయి.పంచతలల చిన్నశేష వాహనం పంచభూతాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా భావించబడుతుంది. జగత్తుకు ఆధారమైన ఆది శేషునిపై స్వామివారు ఏకాకిగా విహరించడం ద్వారా విశ్వ సంరక్షకుడైన మహావిష్ణువు సర్వలోకాల రక్షకుడనే ఆధ్యాత్మిక సందేశాన్ని భక్తులకు అందించారు.ఈ సందర్భంగా రాత్రి 7 గంటలకు స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, చంగల్ రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: Sri Kalyana Venkateswara in the guise of Gokulananda.