అమరావతిముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాలలో సూర్యుడి ప్రతాపం పెరుగుతోంది. మే నెల మధ్యలోకి ప్రవేశించటంతో భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటలు దాటితే బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
సాయంత్రం నాలుగు గంటల వరకూ సూర్యుడు విరామం తీసుకోవడం లేదు. దీంతో ఉక్కబోత, వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ బ్యాడ్ న్యూస్ వినిపించింది. మరో ఐదు రోజుల పాటు ఈ పరిస్థితి తప్పదని తెలిపింది. ఆదివారం (మే24) వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.
మే 19 (మంగళవారం) రోజున విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు జిల్లా, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44°C – 46°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు , అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42°C – 44° Cల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలుగా నమోదవుతాయని వెల్లడించారు.
మొత్తంగా మంగళవారం రోజున ఏపీలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మధ్యన నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవటం మంచిదని సూచించింది. అలాగే శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పనిసరై బయటకు వెళ్తే గొడుగు, టోపీ, తలపాగా వంటివి ధరించాలని అప్రమత్తం చేసింది.
Tags: The Sun’s Fury… 46 Degrees in These Districts Tomorrow.