May 19, 2026
Explore
14వ దశలో రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లు రికవరీ.

14వ దశలో రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లు రికవరీ.

May 19, 2026 | Andhra Pradesh

▫️ CIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా బాధితులకు మొబైల్ ఫోన్ల అప్పగింత.

▫️ ఇప్పటివరకు 4,785 మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన తిరుపతి జిల్లా పోలీసులు.

▫️ ఇతర రాష్ట్రాల నుండి కూడా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ.

▫️ CEIR సేవలపై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ.

▫️ మొబైల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందికి అభినందనలు.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమంలో 14వ దశలో భాగంగా సుమారు రూ.1 కోటి విలువ గల 500 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశారు.

ఇప్పటివరకు నిర్వహించిన 13 దశల్లో మొత్తం రూ.10 కోట్లు 52 లక్షలు 70 వేల విలువ గల 4,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగింది.

తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ యల్.సుబ్బరాయుడు వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారిందన్నారు. అలాంటి ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే CEIR సేవల ద్వారా ఫిర్యాదు నమోదు చేసి తమ మొబైల్ ఫోన్లను తిరిగి పొందే అవకాశం కల్పించామని తెలిపారు.

తిరుపతి జిల్లా పోలీసులు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు CEIR సేవలను పొందేందుకు 9490617873 వాట్సాప్ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా CEIR లింక్‌ను సులభంగా పొందవచ్చని తెలిపారు. ఈ నంబర్ ద్వారా CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడానికి అవసరమైన పూర్తి మార్గదర్శకం మరియు సాంకేతిక సహాయం అందించబడుతుందని వివరించారు.

ప్రజలు తమ మొబైల్ ఫోన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా ఫోన్ రికవరీ అవకాశాలు పెరుగుతాయి. సైబర్ మోసాలు మరియు డిజిటల్ నేరాల నుండి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ బలమైన పాస్‌వర్డ్లు ఉపయోగించడంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దు. ప్రజల ఆస్తుల రక్షణకు తిరుపతి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తారు.

CEIR ద్వారా ఫిర్యాదు నమోదు విధానం:

  1. కేంద్ర ప్రభుత్వ సేవ అయిన CEIR పోర్టల్ (https://www.ceir.gov.in) ద్వారా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన సందర్భంలో ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
  2. IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఆ మొబైల్ దేశవ్యాప్తంగా ఉపయోగించకుండా చేయవచ్చు. దీంతో ట్రాకింగ్ సులభమవుతుంది.
  3. మొబైల్ తిరిగి లభించిన అనంతరం అదే పోర్టల్ ద్వారా అన్‌బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రజలకు సూచనలు:

  1. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి.
  2. మొబైల్ మరియు PhonePe, Google Pay, Paytm వంటి యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్లు ఉపయోగించాలి.
  3. వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి.
  4. అపరిచితుల నుండి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయరాదు.
  5. అనధికారికంగా కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లు భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, తిరుపతి సైబర్ క్రైమ్ విభాగం సి.ఐ ఆర్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్ల ట్రాకింగ్ మరియు రికవరీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందికి అప్రిషెషన్ సర్టిఫికెట్లను ఇచ్చి జిల్లా ఎస్పీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వెంకటరావు (పరిపాలన) వినోద్ కుమార్ సైబర్ సెల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags: 500 mobile phones worth ₹1 crore recovered in the 14th phase.