పట్టపగలే మూడు జేసీబీలు, 50 ట్రాక్టర్లతో అక్రమ దందా
ట్రక్కు మట్టి రూ. 600 నుంచి రూ. 800 వరకు విక్రయం
మా వెనుక అధికారుల బలముందంటూ మైనింగ్ కేటాయింపుదారుల ధీమా
సమాచారమున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం
రెడ్డిగూడెం ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. స్థానిక చెరువును ఆసరాగా చేసుకుని గత మూడు రోజులుగా యథేచ్ఛగా భారీ ఎత్తున అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మూడు జేసీబీలను రంగంలోకి దించి, సుమారు 50 ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రక్కు మట్టిని రూ. 600 నుండి రూ. 800 చొప్పున విక్రయిస్తూ రోజుకు వేల రూపాయలు అక్రమంగా గడిస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి.. పర్యావరణానికి ముప్పు
ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. అంతేకాకుండా, చెరువులో పెద్ద పెద్ద గోతులు పెట్టడం వల్ల భూగర్భ జల మట్టం దెబ్బతినే ప్రమాదం ఉందని, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అండదండలతోనే దందా?
ఈ అక్రమ తవ్వకాలపై స్థానికులు నిలదీయగా.. తాము రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించామని, అందుకే ధైర్యంగా వ్యాపారం చేసుకుంటున్నామని మైనింగ్ నిర్వాహకులు బహిరంగంగానే సమాధానం ఇస్తుండటం గమనార్హం. “మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు” అంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే ఇంత విచ్చలవిడిగా దందా సాగుతున్నా.. స్థానిక రెవెన్యూ అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండటం వల్లే మైనింగ్ మాఫియా ఇంతలా రెచ్చిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఉన్నతాధికారులకు సమాచారం అందినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మద్దులపర్వ చెరువులో సాగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Tags: Rampant Soil Excavation at Maddulaparva Tank!