అమెరికా ముచ్చట్లు:
అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణా రాష్టం నల్గొండ జిల్లాకు చెందిన గడ్సు నవ్య (24) అనే యువతి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన నవ్య, రెండున్నరేళ్ల క్రితం ఉన్నత చదువుల (MS) కోసం అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమె, శనివారం రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా చికాగో సమీపంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్య ప్రాణాలు కోల్పోవడంతో ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
కూతురి మరణవార్త తెలిసి తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, శోభ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నవ్య మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేయాలని వారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి, నవ్య మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Tags: Road Accident in the US: Young Woman from Telangana Dies