హైదరాబాద్ ముచ్చట్లు:
ఈమె హైదరాబాద్ ప్రిన్సెస్ బేగం సాహిబా నిలోఫర్ ఖానుమ్ సుల్తానా ఫర్హత్. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండో కుమారుడు మోజం జా మొదటి భార్య. హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లో ఉన్న ప్రసిద్ధ ‘నిలోఫర్ హాస్పిటల్’ ఈమె పేరు మీదే ఏర్పాటుచేశారు. అయితే, ఈ నిలోఫర్ హాస్పిటల్ వెనుక పెద్ద కథే ఉంది. ఎక్కడో టర్కీలోని ఇస్తాంబుల్‌లో పుట్టిన నిలోఫర్.. హైదరాబాద్ వచ్చి ఈ హాస్పిటల్ నిర్మించడానికి కారకురాలు ఎలా అయ్యారో ఇప్పుడు చూద్దాం.
టర్కీలోని ఒట్టోమన్ సామ్రాజ్యపు చివరి యువరాణులలో ఒకరైన ప్రిన్సెస్ నిలోఫర్.. 1916 జనవరి 4న ఇస్తాంబుల్‌లో జన్మించారు. 1924లో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం కావడంతో ఆమె కుటుంబం ఫ్రాన్స్‌కు వలస వెళ్లింది. ఆ తర్వాత 1931 డిసెంబర్ 20న ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ప్రిన్స్ మోజం జాతో నిలోఫర్‌కు వివాహం జరిగింది. అప్పటికి ప్రిన్సెస్ నిలోఫర్ వయసు దాదాపు 16 సంవత్సరాలు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన ప్రిన్సెస్ నిలోఫర్.. తమ హిల్ ఫోర్ట్ నివాసంలో భర్తతో కలిసి ఉండేవారు.
ప్రిన్సెస్ నిలోఫర్.. హైదరాబాద్‌కు చేరుకునే సమయానికి ఆమెకు ఉర్దూ రాదు. ఇక్కడి కట్టుబాట్లు, పద్ధతులు ఏమీ తెలియవు. కానీ ఆమె అన్నీ నేర్చుకున్నారు. చీర కట్టడం నేర్చుకున్నారు. ఉర్దూ నేర్చుకున్నారు. పర్దా పాటించడానికి నిరాకరించారు. నిజాం కుటుంబంలోని ఇతర మహిళలు మూసి ఉన్న తలుపుల వెనుక ఉండిపోగా.. నిలోఫర్ మాత్రం బహిరంగ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సామాజిక సమావేశాలకు హాజరయ్యేవారు.
అంతర్జాతీయ పత్రికలు ప్రిన్స్ నిలోఫర్‌ను ప్రపంచంలోని పది మంది అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేర్కొన్నాయి. కానీ ఆ గ్లామర్ వెనుక ఆమె వ్యక్తిగత జీవితం బాధాకరంగా ఉండేది. ప్రిన్సెస్ నిలోఫర్‌కి పిల్లలు కలగలేదు. ఇది భర్తతో విబేధాలకు దారి తీసింది. దీంతో ఆమె 1948లో ఫ్రాన్స్‌లోని తల్లి వద్దకు వెళ్లిపోయారు. ఆ వెంటనే రజియా బేగంను మోజం జా పెళ్లి చేసుకున్నారు. 1951 నాటికి భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిలోఫర్ నిర్ణయించుకున్నారు. దాదాపు 21 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం ఆమె భర్త నుంచి విడిపోయారు.
అయితే, ప్రిన్సెస్ నిలోఫర్ ఫ్రాన్స్‌లో ఉన్న సమయంలో హైదరాబాద్‌లో ప్రసూతి హాస్పిటల్ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు కలిగింది. దీని వెనుక ఒక విషాధకరమైన ఘటన ఉంది. నిలోఫర్ వ్యక్తిగత పని మనిషి రఫత్ ఉన్నీసా బేగం.. 1949లో ప్రసవ సమయంలో మరణించారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనతో నిలోఫర్ తీవ్రంగా కలత చెందారు. భవిష్యత్తులో ఇలాంటి మరణాలు మరెక్కడా సంభవించకూడదని ఆమె గట్టిగా నిశ్చయించుకున్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను ఒప్పించారు. ‘ఇకపై ఏ రఫత్ కూడా ఇలా ప్రాణాలు కోల్పోకూడదు’ అని నిలోఫర్ అన్నట్లు చెబుతారు. అలా నాంపల్లిలోని రెడ్ హిల్స్‌లో 1949 చివరలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ‘నిలోఫర్ హాస్పిటల్’కు శంకుస్థాపన చేశారు. 1953లో భారత తొలి ఆరోగ్య శాఖ మంత్రి రాజ్‌కుమారి అమృత్ కౌర్ చేతుల మీదుగా ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది. ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగే సమయానికి నిలోఫర్ ఫ్రాన్స్‌లో ఉండటం వల్ల ఆమె ఆ వేడుకకు హాజరుకాలేదు. ఆ తర్వాత కూడా ఎన్నడూ హైదరాబాద్ రాలేదు.
ప్రిన్సెస్ నిలోఫర్ తన శేషజీవితాన్ని పారిస్‌లో గడిపారు. 1989 జూన్ 12న 73 ఏళ్ల వయసులో నిలోఫర్ మృతి చెందారు. ఆమె మన మధ్య లేకపోయినా ఆమె పేరిట నిర్మించిన నిలోఫర్ హాస్పిటల్ నేడు 500 పడకల ఆసుపత్రిగా వేలాది మంది తల్లులు, పిల్లలకు సేవలు అందిస్తోంది..
Tags; The Seventh Nizam, Mir Osman Ali