March 20, 2026
Explore
ఆస్తులు ప్రకటించిన కేరళ సీఎం.. దంపతుల వద్ద కోటికి పైగా డిపాజిట్లు

ఆస్తులు ప్రకటించిన కేరళ సీఎం.. దంపతుల వద్ద కోటికి పైగా డిపాజిట్లు

March 20, 2026 | Andhra Pradesh

కేరళ ముచ్చట్లు:

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. ధర్మదం నియోజకవర్గం నుంచి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆయన, తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఈ అఫిడవిట్ ప్రకారం విజయన్, ఆయన భార్య కమల పేరిట రూ. కోటికి పైగా డిపాజిట్లు ఉన్నాయి. కేరళలో ఏప్రిల్ 9న 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

విజయన్ పేరిట రూ. 43.35 లక్షలు, ఆయన భార్య కమల పేరిట రూ. 60.58 లక్షల డిపాజిట్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. విజయన్‌కు 78 సెంట్ల భూమి ఉండగా, ఆయన భార్యకు 17.5 సెంట్ల భూమి, 10 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇద్దరికీ ఎలాంటి అప్పులు లేవని స్పష్టం చేశారు. అదే సమయంలో, తనపై మూడు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అయితే ఏ కేసులోనూ తనకు శిక్ష పడలేదని విజయన్ వెల్లడించారు.

తలసేరి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సచిన్ కృష్ణకు ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. సీపీఎం సీనియర్ నేతలు ఈ.పి. జయరాజన్, ఎ.ఎన్. షంసీర్, కె.కె. రాగేష్ ఆయన వెంట ఉన్నారు. పినరయి విజయన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం ఇది ఏడోసారి. 1970లో 25 ఏళ్ల వయసులో తొలిసారి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ధర్మదం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు.

Tags: Kerala CM Declares Assets: Couple Holds Deposits Exceeding One Crore