May 17, 2026
Explore
రౌడీషీటర్లకు మదనపల్లి డీఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

రౌడీషీటర్లకు మదనపల్లి డీఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

May 17, 2026 | Andhra Pradesh

‘సత్ప్రవర్తనతో జీవించండి.. లేదంటే కఠిన చర్యలు తప్పవు’..

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు దాదాపు 200 మందికి కౌన్సిలింగ్..

మదనపల్లి ముచ్చట్లు:

సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మదనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ బి. పావని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, ఆదివారం మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు భారీ స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన దాదాపు 200 మంది రౌడీషీటర్లు ఈ కౌన్సిలింగ్ కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పాత నేర ప్రవృత్తిని, అలవాట్లను పూర్తిగా స్వస్తి పలికి, సమాజంలో సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవనం సాగించాలన్నారు.

నిరంతర నిఘా ఉంటుంది..
పట్టణాల్లో గానీ, గ్రామీణ ప్రాంతాల్లో గానీ రౌడీయిజం, భూదందాలు, బెదిరింపులు లేదా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి చర్యలకు పాల్పడినా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై స్థానిక పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎవరైనా మళ్లీ నేరాల బాట పడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టం తన విధిని అత్యంత కఠినంగా నిర్వర్తిస్తుందని డీఎస్పీ పావని గారు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Madanapalle DSP Issues Strong Warning to Rowdy-sheeters