May 17, 2026
Explore
కటకటాల్లోకి అవినీతి ఖాకీ.. తాడేపల్లిగూడెంలో ఏసీబీ థ్రిల్లర్ ఆపరేషన్

కటకటాల్లోకి అవినీతి ఖాకీ.. తాడేపల్లిగూడెంలో ఏసీబీ థ్రిల్లర్ ఆపరేషన్

May 17, 2026 | Andhra Pradesh

పశ్చిమగోదావరి పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పేరూరి నాగరాజు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమజంట వివాదం పేరుతో మొదలైన వ్యవహారం చివరకు లంచం డీల్‌గా మారి ఏసీబీ వలలో చిక్కుకోవడం కలకలం రేపుతోంది.

ప్రేమ వ్యవహారం నుంచి లంచం డీల్ వరకు…

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మేజర్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో వారు ఏలూరుకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిపై తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో “రేప్ కేసు పెడతాం… రౌడీషీట్ ఓపెన్ చేస్తాం” అంటూ ఎస్సై నాగరాజు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నుంచి బయటపడాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. మధ్యవర్తుల చర్చల తర్వాత రూ.70 వేల వద్ద డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

షెడ్‌లో డబ్బుల డీల్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ షెడ్ వద్ద కానిస్టేబుల్ బాలసుబ్రహ్మణ్యం ద్వారా రూ.70 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

“మా కానిస్టేబుల్‌కు ఇచ్చినా… నాకు ఇచ్చినా ఒక్కటే” అంటూ ఎస్సై నాగరాజు మాట్లాడినట్లుగా ఏసీబీ వద్ద వాయిస్ రికార్డులు ఉన్నాయన్న సమాచారం కేసుకు మరింత బలం చేకూరుస్తోంది.

ఎస్సైను కాపాడేందుకు ఒత్తిళ్లు?

ఈ వ్యవహారం బయటపడిన తర్వాత కొందరు రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్సై నాగరాజును కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే ఏసీబీ అధికారులు ఒత్తిళ్లకు లొంగకుండా నాగరాజును అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించడం చర్చనీయాంశమైంది.

ప్రైవేట్ సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్ వేదికా?

ఈ కేసులో బాధితురాలు, ఆమె తల్లి నిర్వహించిన మీడియా సమావేశం కొత్త అనుమానాలకు తావిస్తోంది. “బంగారం వ్యవహారంలో సహాయం కోసం ఎస్సైను ఆశ్రయించాం” అని వారు చెప్పడం… అదే సమయంలో డబ్బుల వ్యవహారంలో ఏసీబీ పట్టుకోవడం ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో ప్రైవేట్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.

అక్రమ ఆస్తులపై కూడా చర్చ

ఎస్సై నాగరాజు అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టాడని, బినామీల పేర్లతో పొలాలు, స్థలాలు కొనుగోలు చేశాడన్న ఆరోపణలు కూడా స్థానికంగా చక్కర్లు కొడుతున్నాయి. రోజూ పోలీస్ స్టేషన్ పేరుతో అమాయకులను బెదిరించి లక్షల్లో వసూళ్లు చేశాడన్న ప్రచారం మరింత సంచలనంగా మారింది.

గట్టి హెచ్చరికగా మారిన ఘటన

చట్టాన్ని అమలు చేయాల్సిన ఖాకీ అవినీతి ఆరోపణలతో కటకటాల పాలవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “ఎంతటి ఒత్తిడి వచ్చినా అవినీతిని వదిలిపెట్టబోమన్న” సందేశాన్ని ఏసీబీ ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టం చేసిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Tags: Corrupt Cop Behind Bars: ACB Conducts Thriller Operation in Tadepalligudem