May 17, 2026
Explore
అప్పుల బాధతో అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధతో అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం

May 17, 2026 | Andhra Pradesh

-వినాయకుని బొమ్మలు తయారుచేసి అప్పుల్లో కూరుకు పోయిన బాధితులు
-రుణ దాతల ఒత్తిళ్లు తాళలేక అత్తగారి ఇంటికెళ్లి చనిపోవాలనుకున్న సోదరులు
-విషమించిన అన్నదమ్ముల ఆరోగ్య పరిస్థితి
-అన్నమయ్య జిల్లాలో కలకలం రేపుతున్న అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం

మదనపల్లె టౌన్ ముచ్చట్లు:

నేటి కంప్యూటర్ యుగంలో కూడా కుల వృత్తినే నమ్ముకుని వినాయకుని బొమ్మలు తయారుచేస్తూ, వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్న ఓ పేదింటి కుటుంబం పీకల్లోతు కష్టాల్లోకి కూరుకు పోయింది. చేసిన అప్పులు చాంతాడంత అయ్యాయి. అవి తీర్చడం వారికి కష్టంగా మారింది. ఒకవైపు వినాయకుడి బొమ్మల వ్యాపారం మందకొడిగా సాగడం, పెట్టిన పెట్టుబడులు చేతికి అందకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేక పీకల్లోతో కష్టాల్లోకి కూరుకు పోయారు. రుణ దాతల ఒత్తిళ్ల నుంచి బయటపడలేక చావే శరణ్యం అనుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఊరికి దూరంగా వెళ్లి చావాలనుకుని, మద్యంలో విషం కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృత్యువుతో పోరాడు తున్నారు. శనివారం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపున అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నానికి సంబంధించి, బాధితుల కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం, బికేపల్లి కాలనీలో కాపురం ఉంటున్న అన్నదమ్ములు శ్రీనివాసులు (35) అనిల్ (30) కుమ్మర వృత్తిలో భాగంగా ఇంటిదగ్గరే వినాయకుడి బొమ్మలు తయారు చేసుకుంటూ అమ్మకాలు సాగించే వారు. ఈ క్రమంలో వారి వ్యాపారం మందకొడిగా సాగడంతో ఒక్కొక్కరు సుమారు 8 లక్షల నుంచి 11 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, రుణదాతల వేధింపులు అధికం కావడంతో జీవితం పై విరక్తి చెందారు. చనిపోవాలని నిర్ణయించుకుని ఇద్దరు అన్నదమ్ములు తంబళ్లపల్లి నియోజకవర్గం లోని పిటిఎం మండలం, రంగసముద్రంలో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్లారు. అక్కడ మధ్యంలో విషం కలుపుకుని తాగి ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబీకులు గమనించి బాదితులను వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, మెరుగైన వైద్య చికిత్సలు అందించినా వారి ఆరోగ్యం కుదుట పడలేదు. అనంతరం ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు బాధితులను తిరుపతికి తరలించారు. ఘటనపై పిటీఎం పోలీసులు విచారణ చేస్తున్నారు. అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నానికి గల మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Tags; Brothers Attempt Suicide Due to Debt Burden