May 16, 2026
Explore
అంతర్ జిల్లా బైక్ , బంగారు ఆభరణాల దొంగల ముఠా అరెస్ట్

అంతర్ జిల్లా బైక్ , బంగారు ఆభరణాల దొంగల ముఠా అరెస్ట్

May 16, 2026 | Andhra Pradesh

– ₹66 లక్షల విలువైన సొత్తు స్వాధీనం.

అనకాపల్లి ముచ్చట్లు:

మునగపాక మండలంలో జరిగిన ఓ దొంగతనం కేసును ఛేదించే క్రమంలో, పక్కా సమాచారంతో అనకాపల్లి జిల్లా పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. వివిధ జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ అంతర్ జిల్లా దొంగలను మునగపాక పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు ₹66,00,000/- విలువైన 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

కేసు నేపథ్యం: గత మే 2వ తేదీన మునగపాక మండలం, వెంకటాపురం గ్రామంలో జరిగిన దొంగతనంపై మునగపాక పోలీస్ స్టేషన్ ఎస్సై గారు కేసు (Cr No. 89/2026 U/s 331(3), 305(a) BNS) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ రోజు (16.05.2026) ఉదయం 08:00 గంటల సమయంలో మునగపాక ఎస్సై పి.ప్రసాద రావు గారికి అందిన నమ్మకమైన సమాచారంతో, సిబ్బందితో కలిసి అనకాపల్లి బైపాస్ రోడ్డు (NH-16) లక్ష్మీపురం బస్ స్టాప్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే మోటార్ సైకిల్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, అలర్ట్ అయిన పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు.

నిందితుల వివరాలు మరియు నేర చరిత్ర: పోలీసుల విచారణలో నిందితులు ముగ్గురూ పాత నేరస్థులని, వారిపై ఇప్పటికే పలు స్టేషన్లలో రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నట్లు తేలింది.

నిందితుల పేర్లు :
A1) రొంగలి ప్రకాష్ (24) , పాచిలవానిపాలెం, కె.కోటపాడు, అనకాపల్లి జిల్లా.
A2) ఈర్ల వినయ్ కుమార్ (28) (ఆటో డ్రైవర్), అక్కయ్యపాలెం, విశాఖపట్నం.
A3 ) సిరికి విజయ్ కుమార్, (27) పాచిలవానిపాలెం, కె.కోటపాడు, అనకాపల్లి జిల్లా.

అంగీకరించిన నేరాలు:
నిందితులను లోతుగా విచారించగా మునగపాకతో పాటు ఈ క్రింది పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా తామే దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు:
ఎలమంచిలి టౌన్, ఎలమంచిలి రూరల్, రాంబిల్లి, అనకాపల్లి రూరల్, సబ్బవరం, అనకాపల్లి జిల్లా, ఎస్.కోట (విజయనగరం జిల్లా),
నాదెండ్ల (గుంటూరు జిల్లా).

ప్రస్తుతం నిందితుల నుండి ₹66 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించడం జరిగింది.

ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన పరవాడ సబ్ డివిజన్ ఇంచార్జీ డీఎస్పీ బి.మోహన రావు, యలమంచిలి సర్కిల్ సీఐ ఎస్.ధనుంజయ రావు, రాంబిల్లి సీఐ, సిహెచ్.నర్సింగరావు, అనకాపల్లి సిసిఎస్ సీఐ కె.అప్పలనాయుడు, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ టి.విజయ మరియు ఎస్సైలు ప్రసాదరావు (మునగపాక), సావిత్రి (ఎలమంచిలి), నాగేంద్ర (రాంబిల్లి), రామకృష్ణ (ఎలమంచిలి ట్రాఫిక్), విశ్వనాథం (సిసిఎస్) మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలను అందజేశారు.

ప్రజలకు జిల్లా ఎస్పీ గారి హెచ్చరిక / విజ్ఞప్తి
వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ కోరుతోంది. మీ ఇళ్లకు, వ్యాపార సంస్థలకు భద్రత పెంచుకోవడానికి క్రింది సూచనలు పాటించండి:
LHMS (Locked House Monitoring System): ప్రజలు ఊర్లకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి లేదా LHMS యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. దీనివల్ల మీ ఇళ్లకు పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతారు.
CCTV కెమెరాల ఏర్పాటు: ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, కాలనీలలో, వ్యాపార సముదాయాలలో తప్పనిసరిగా సిసిటివి (CCTV) కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇవి దొంగతనాలను అరికట్టడమే కాకుండా, నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు మూడో కన్నులా ఉపయోగపడతాయి.
అనుమానాస్పద వ్యక్తులు: మీ పరిసరాల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరిగే వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 100/112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించండి.

Tags:Inter-District Gang of Bike and Gold Jewelry Thieves Arrested