– ఎండ తీవ్రతకు తోడైన అధికారుల నిర్లక్ష్యం!
తిరుమల ముచ్చట్లు:
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు క్యూలైన్లలో ఉక్కపోతతో భక్తులు విలవిలలాడుతున్నారు. వేసవి కాలం రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పనిచేయని ఫ్యాన్లు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న భక్తులు
శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు చాలా చోట్ల మూలపడ్డాయి. పనిచేయని ఈ ఫ్యాన్ల వల్ల లోపల గాలి ఆడక, విపరీతమైన ఉక్కపోతతో భక్తులు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఉక్కపోతను తట్టుకోలేక చిన్నపిల్లలు ఏడుస్తున్న దృశ్యాలు క్యూలైన్లలో గుండెలు పిండేస్తున్నాయి.
Tags; Devotees throng the queues in Tirumala
ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. సౌకర్యాలపై లేదా?
కానుకలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు, దర్శన టికెట్ల ద్వారా టీటీడీకి రోజుకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఇంత భారీ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పటికీ, క్యూలైన్లలో పాడైపోయిన ఫ్యాన్లను రిపేర్ చేయించాలనే కనీస ఆలోచన అధికారులకు లేకపోవడం గమనార్హం. భక్తులు సమర్పించే కానుకలతో కోట్లు గడిస్తున్న బోర్డు, వారికి కనీస గాలి, వెలుతురు సౌకర్యం కూడా కల్పించలేకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
”అధికారులు ఏసీ రూములు.. సామాన్యులకు ఉక్కపోత కష్టాలు”
సామాన్య భక్తులు క్యూలైన్లలో చెమటలు కక్కుతూ ఇబ్బందులు పడుతుంటే, టీటీడీ ఉన్నతాధికారులు మాత్రం ఏసీ గదులు, ఏసీ కార్లు, విలాసవంతమైన వసతి గృహాలకే పరిమితమయ్యారనే విమర్శలు భక్తుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. విఐపిల సౌకర్యాలపై చూపే శ్రద్ధలో పదో వంతు కూడా సామాన్య భక్తులపై చూపించడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.
తక్షణమే చర్యలు చేపట్టాలి
వేసవి కాలం ఇంకా ముగియనందున భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి, క్యూలైన్లలోని క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలి. యుద్ధప్రాతిపదికన పాడైన ఫ్యాన్లను రిపేర్ చేయించడంతో పాటు, భక్తులకు చల్లని తాగునీరు, నిరంతర గాలి వీచేలా అదనపు కూలర్లు ఏర్పాటు చేయాలని సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నారు