May 16, 2026
Explore
అర్ధరాత్రి వ్యూహం.. తెల్లవారుజామున మెరుపు దాడి!

అర్ధరాత్రి వ్యూహం.. తెల్లవారుజామున మెరుపు దాడి!

May 16, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లాలో పోలీసుల ‘ఆపరేషన్ వజ్రప్రహార్’..

మదనపల్లి ముచ్చట్లు:

శాంతిభద్రతల పరిరక్షణే శ్వాసగా, ప్రజల సురక్షిత జీవనమే పరమావధిగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ శనివారం తెల్లవారుజామున అత్యంత పకడ్బందీగా రెండు భారీ నిఘా ఆపరేషన్‌లను నిర్వహించింది. జిల్లాను నేరరహితంగా మార్చడానికి, సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న శక్తుల ఆటకట్టించడానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఆదేశాల మేరకు “ఆపరేషన్ వజ్రప్రహార్” నిర్వహించారు.

ఈ వ్యూహాత్మక చర్య శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, జిల్లా అంతా ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో అత్యంత నిశ్శబ్దంగా మొదలైంది. మదనపల్లె, రాయచోటి సబ్ డివిజన్లలోని సమస్యాత్మక ప్రాంతాలే లక్ష్యంగా పోలీసులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. సరిగ్గా సమయం ఉదయం 4:00 గంటలు.. కోడికూత కూడా వినబడని ఆ కారుచీకట్లో ప్రజల రక్షణ కోసం పోలీస్ బలగాలు అడుగులు వేశాయి. మదనపల్లె డీఎస్పీ బి. పావని గారి నేతృత్వంలో 105 మంది, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ గారి నేతృత్వంలో 61 మంది.. మొత్తం 166 మంది నిబద్ధత గల పోలీస్ అధికారులు, సిబ్బంది ఏకకాలంలో రంగంలోకి దిగారు. ఎవరికీ ఎటువంటి ముందస్తు సమాచారం లీక్ కాకుండా, అత్యంత రహస్యంగా మదనపల్లె తాలూకా పరిధిలోని కోళ్లబైలు జగన్ కాలనీ, కలకడ మండలం బంగారువాండ్లపల్లి గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. నిశ్శబ్దంగా సాగిన ఈ మెరుపు తనిఖీలు (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో క్షేత్రస్థాయి సిబ్బంది వీధుల్లో సోదాలు నిర్వహిస్తుండగా, భూతలం నుండి ఎవరూ తప్పించుకోకుండా నిఘాను మరింత పటిష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అధునాతన డ్రోన్ కెమెరాల ద్వారా గ్రామాలపై గగనతలం నుంచి పర్యవేక్షణ చేపట్టారు. గ్రామంలోని ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తూ అసాంఘిక శక్తుల కదలికలను గుర్తించేలా నిఘా కొనసాగించారు. ఈ అధునాతన నిఘా వ్యవస్థతో గ్రామాల్లోని ప్రతి సందు, పొదలు మరియు నిర్మానుష్య ప్రాంతాలను కంట్రోల్ రూమ్ స్క్రీన్లపై నిరంతరం పర్యవేక్షించారు.

పోలీసులు పన్నిన ఈ రక్షణ వలయంలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా సాగాయి. రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తూ, నెంబర్ ప్లేట్లు మార్చి, సరైన రికార్డులు లేకుండా తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆయా ప్రాంతాలలో అనుమానాస్పదంగా ఉన్న మొత్తం 133 వాహనాలను నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. పక్కా ఆధారాలు లేని 78 వాహనాలను స్పాట్‌లోనే స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందులో 71 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లు మరియు ఒక ట్రాక్టర్ ఉన్నాయి. చట్టపరమైన పూర్తి పత్రాలు సమర్పించిన తర్వాతే ఈ వాహనాలను విడుదల చేయడం జరుగుతుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అయితే పోలీస్ శాఖ అంటే కేవలం తనిఖీలు, కేసులు మాత్రమే కాదు.. ప్రజలతో మమేకమయ్యే రక్షకులు అని నిరూపిస్తూ, తనిఖీల అనంతరం మదనపల్లెలో 300 మంది, కలకడలో 210 మంది ప్రజలను ఒకచోటకు చేర్చి ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. స్థానిక శాంతిభద్రతల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. “మీ ప్రాంతాల రక్షణే మా బాధ్యత. ఊర్లోకి కొత్త వ్యక్తులు వచ్చినా, లేదా ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి” అని స్థానికుల్లో ధైర్యాన్ని నింపారు. అనంతరం సమాజ శ్రేయస్సు కోసం, నేరాల నిర్మూలన కోసం ప్రజలందరితో కలిసి పోలీసులు, ఈగల్ టీమ్ సిబ్బంది “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” చేయించారు. ప్రజలు, పోలీసులు కలిసికట్టుగా నిలబడిన ఆ క్షణం ఈ ఆపరేషన్‌కే మకుటాయమానంగా నిలిచింది.

యువత భవిష్యత్తును పాడుచేస్తూ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల (గంజాయి, డ్రగ్స్) ముఠాలను వేరుతో సహా తొలగించడమేనని. ఈ సందర్భంగా డిఎస్పీ లు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై జిల్లాలో గంజాయి రవాణా చేసినా, విక్రయించినా పాత నేరస్థులైనా, కొత్త వారైనా సరే.. పీడీ యాక్ట్, పి.ఐ.టి, ఎన్‌డీపీఎస్ చట్టాల కింద అత్యంత కఠినమైన జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.

ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం.. ప్రతి పల్లెలో, పట్టణంలో ఆటోలకు మైకులు కట్టి, గంజాయి మహమ్మారి వల్ల కుటుంబాలు ఎలా రోడ్డున పడతాయో వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని కోరుతున్నారు. ప్రజలు తమ పరిసరాలలో గంజాయి విక్రయాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100 / 112 నెంబర్లకు లేదా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేసి సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ బారిన పడి ఉంటే, వారిని మార్చడం కోసం మదనపల్లెలో ‘డి-అడిక్షన్ సెంటర్’ అందుబాటులో ఉందని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఐలు, మరియు పలు స్టేషన్ల ఎస్ఐలు, ఈగల్ టీమ్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది అంకితభావంతో శ్రమించారు.

అన్నమయ్య జిల్లా ప్రజలారా! ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యం. అసాంఘిక శక్తుల మూలాలు మట్టుబెట్టే వరకు, ప్రతి పౌరుడు ప్రశాంతంగా నిద్రపోయే వరకు అన్నమయ్య జిల్లా పోలీసుల ఈ “ఆపరేషన్ వజ్రప్రహార్” నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. పోలీసులకు సహకరించండి – ప్రశాంత అన్నమయ్య జిల్లాను నిర్మించుకుందాం!

Tags: Midnight Strategy… Dawn Lightning Strike!