May 1, 2026
Explore
అప్పట్లో కార్మిక శక్తి అలా ఉండేది

అప్పట్లో కార్మిక శక్తి అలా ఉండేది

May 1, 2026 | Andhra Pradesh

: అమెరికా ఉద్యమంతో మే డే పుడితే.. బ్రిటన్ పోరాటంతో 8 గంటల పని..!

అమెరికా ముచ్చట్లు:

అమెరికాలోని కార్మికులనే కాక ప్రపంచ కార్మికులందరినీ ప్రభావితం చేసిన చికాగో హేమార్కెట్ సంఘటన తో మేడేకు తొలి అడుగు పడింది. 1886, మే 1న కార్మికుల ర్యాలీగా మొదలై మే 4న జరిగిన ఈ సంఘటన చరిత్ర పుస్తకాల్లోని లిచిపోయింది.

అయితే ఈ సంఘటన జరిగిన తొలి నాళ్లలో దాని ప్రాముఖ్యతను గుర్తించిన వారు చాలా తక్కువ మందే. ఎందుకంటే హేమార్కెట్ ఎఫైర్ జరిగిన వందేండ్ల తర్వాత అంటే 1992లో మాత్రమే ఈ ఘటన జరిగిన ప్రదేశాన్ని ‘చికాగో ల్యాండ్ మార్క్’ గా ప్రకటించారు. 2004లో అక్కడ ఒక శిల్ప కళా ఖండాన్ని ప్రతిష్టించారు. ఆనాడు అమరులైన నిరసన కారులను ఖననం చేసిన ఫారెస్ట్ పార్కులో నిర్మించిన హే మార్కెట్ అమరుల స్మారక కట్టడం.. 1997లో జాతీయ చారిత్రక ల్యాండ్ మార్క్ గా ప్రకటించారు.

అమెరికాలో లాయల్టీ డేగా..
ప్రపంచవ్యాప్తంగా మే డే లేదా అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా పిలవబడుతున్న మే 1ని అమెరికాలో లాయల్టీ డేగా వ్యవహరిస్తున్నారు. చాలా దేశాల్లో మేడే ని సెలవు దినంగా పాటిస్తున్నారు. అయితే ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో చికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే మే డే పుట్టుకకు పునాది వేసిందని చరిత్రకారులు చెబుతుంటారు.

కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం డిమాండ్ తో 1886, మే 1న కార్మికులు నిరసన చేపట్టారు. దానికి మద్ధతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో చాలా మంది కార్మికులు చనిపోయారు. అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు ఊపందుకున్నాయి.

8 గంటల పని డిమాండ్తో..
బ్రిటన్ లోని హైడ్ పార్క్ 1890, మే 1న చేపట్టిన ప్రదర్శనలో దాదాపు 3 లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. రోజులో 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే వారి ప్రధాన డిమాండ్. ఇదే తరహాలో మిగతా యూరోపియన్ దేశాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. 1892లో అమెరికాలో ప్రజా ప్రయోజన నిర్మాణ ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికుల పని గంటలను 8 గంటలకు కుదిస్తూ అమెరికా కాంగ్రెస్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ క్రమంలో షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. తర్వాతి కాలంలో ప్రపంచవ్యా ప్తంగా మేడే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడం మొదలైంది.

ప్రపంచవ్యాప్తంగా నిరసనలు
యూరప్ లో 1900 నుంచి 1920 వరకూ ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసనలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మేడే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తర్వాతి దశకాల్లో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవా రు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగానూ జరుపుకునేవారు. ఇటలీలో ముస్సో లిని, స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో మే డే పైన అనేక ఆంక్షలను విధించారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాల్లో మే 1ని సెలవు దినంగా పాటించడం మొదలైంది. ఆ తర్వాత అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. కార్మికులకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలను చాలా దేశాలు ఆ రోజునే అమల్లోకి తీసుకొచ్చాయి. ఆ విధంగా అటు సంక్షేమ పథకాల అమలుతోపాటు నిరసన ప్రదర్శనలకు మే 1 వేదికగా మారింది. వేర్వేరు దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజునే మొదలయ్యాయి. పలు ఇతర కార్మిక ఉద్యమాలు కూడా మే డే నాడే ప్రాణం పోసుకున్నాయి.

చికాగో కన్నా ముందే కలకత్తాలో..
మన దేశంలో చికాగో సంఘటన కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్లో .. అధికారులు ఎన్ని గంటలు పనిచే స్తారో.. మేము కూడా అన్ని గంటలే పనిచేస్తాం.. అనే డిమాండ్ తో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అయితే ఆ సమ్మె విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. అందువల్ల అది ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడిన తర్వాత కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం లాంటి కారణాల వల్ల మన దేశంలో 1923లో మొదటిసారి మే డే ను పాటించారు.

అప్పటి నుంచి దేశంలో మే డే ని పాటిస్తున్నారు. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలు అంతగా అమలుకు నోచుకోవడం లేదు. కార్మికుల పని వాతావరణంతోపాటు వేతనాలు మెరుగవ్వాలన్నది చాలా కాలంగా లేబర్ యూనియన్ల ప్రధాన డిమాండ్ గా మారింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో మే డేని సెలవుదినంగా పాటిస్తున్నారు. ట్రేడ్ యూనియన్లు ఇదే రోజున ధర్నాలతో పాటు ర్యాలీలు చేపడుతాయి.

Tags; Back then, the workforce was like that.