April 10, 2026
Explore
రాయచోటిలో ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్చ

రాయచోటిలో ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్చ

April 10, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలో కబ్జాలు చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయా? ప్రభుత్వ స్థలాలు మాయమవుతున్నాయా? అధికారులకు తెలియకుండానే ఇలాంటి కబ్జాలు జరుగుతున్నాయా? తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటారా? ఇలా అయితే ప్రభుత్వ భూములకు రక్షణ ఎలా? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాయచోటి ప్రాంతంలో ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారాయి.

రాయచోటి పరిధిలోని సుండుపల్లి రోడ్డు శిబ్యాల సమీపంలో నిర్మాణాలు జరుగుతున్న టిడ్కో ఇళ్లకు సంబంధించిన కోట్లు విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు పలు కోణాల్లో చర్చించుకుంటున్నారు. టిడ్కో ఇళ్లకు కేటాయించిన స్థలంలో గతంలో రెండు బోర్లు వేయడంతో పాటు రెండు గదులు కూడా నిర్మించారు. అయితే ప్రస్తుతం బోర్లు నిర్వీర్యంగా మారగా, గదులు కూడా చదును చేయబడ్డాయి.

ఓ ముఖ్య నాయకుడి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని సమీప ప్రజలు ఆరోపిస్తున్నారు. కోట్లు విలువ చేసే ఆ స్థలాన్ని భాగాలుగా చేసి, తన ప్రభావంతో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయించినట్లు చెబుతున్నారు. అయితే ఆ స్థలం టిడ్కోకు కేటాయించిన ప్రభుత్వ భూమేనని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

ఆ స్థలాన్ని దళారుల ద్వారా భారీ స్థాయిలో (సుమారు కోటి రూపాయలు) తాకట్టు పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అది టిడ్కోకు చెందిన ప్రభుత్వ భూమి అని వెలుగులోకి రావడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. తాకట్టు పెట్టుకున్న వ్యక్తులు ఇప్పుడు దళారులను నిలదీస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తమ డబ్బులకు దిక్కెవరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మధ్యవర్తులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.

లోపాయికారి ఒప్పందాలు ఇంతవరకు తీసుకొస్తాయని ఊహించలేదని వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అధికారులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు ఇలాంటి కబ్జాలకు గురికాకుండా తగు రక్షణ చర్యలు తీసుకోవాలని, ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అధీనంలో ఉంచాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రజలకు అవగాహన పెరిగి, కబ్జాలను గుర్తించి వెంటనే అధికారులకు తెలియజేయవచ్చని పలువురు సూచిస్తున్నారు.

కబ్జా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో

రాయచోటిలో టిడ్కో స్థలం కబ్జాకు గురికావడం పట్ల ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆర్డీవో శ్రీనివాస్ గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ నరసింహ కుమార్, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆయన కబ్జాకు గురైన టిడ్కో ఇళ్ల స్థలానికి వెళ్లి పరిశీలించారు.

ఈ సందర్భంగా టిడ్కో స్థలానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించి అధికారులతో చర్చించారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags: Discussion on encroachment of government lands in Rayachoti