తిరుపతి ముచ్చట్లు:
- వీనులవిందుగా మార్మోగిన శ్రీరామ నామామృతం
- నృత్యరూపాల్లో వెలిగిన రామాయణ ఘట్టాలు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను భక్తి పరవశంలో ముంచెత్తాయి.
సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు నాదస్వరం–డోలు వాద్యాలతో మంగళప్రదంగా ఆరంభించారు.
అనంతరం శ్రీ హరినాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన సీతాకల్యాణం (భరతనాట్యం), రామాయణ శబ్దం (కూచిపూడి), శ్రీ సీతారాముల జనపద నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వంటి ఘట్టాలను నృత్యరూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన కుమారి ఐశ్వర్య, కుమారి సౌందర్య బృందం ఆలపించిన శ్రీరామ నామామృతం భజన సంకీర్తనలు వీనులవిందుగా నిలిచాయి. భజనలకు భక్తులు గొంతు కలిపి నృత్యంతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ సరస్వతి ప్రసాద్ బృందం ఆలపించిన “పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు…”, “ఆదిమూలమే మాకు అంగరక్ష…”, “అంతయు నీవే హరి పుండరీకాక్ష…” సంకీర్తనలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు రామభక్తి వైభవాన్ని ప్రతిబింబిస్తూ భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచాయి.
Tags: The celestial wedding ceremony of Lord Rama captivated the audience with devotional singing, music, and dance.