తిరుపతి ముచ్చట్లు:
– తెలుగుదనం ఉట్టిపడేలా రాములవారి కల్యాణ వేదిక
– ప్రత్యేక ఆకర్షణగా యాక్రిలిక్ పెయింటింగ్
ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా త్రేతాయుగంనాటి అయోధ్యను గుర్తుకు తెచ్చేలా కల్యాణవేదికను అందంగా తీర్చిదిద్దారు.
వేదిక రంగురంగుల పుష్పాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. వేదికపై, ప్రాచీన ఆలయాలలోని దశావతారాల సెట్టింగు, రామాయణంలోని ఘట్టాలతో యాక్రిలిక్ పెయింటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు పుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.
తెలుగుదనం ఉట్టిపడేలా చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయపూత, అరటి ఆకులు, మామిడాకులు, హెలికానియమ్స్, టార్చ్ జింజర్, నీలం ఆర్కిడ్, రెడ్ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. ఇందుకోసం 5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు.
అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో అత్యద్భుతంగా పుష్పాలంకరణలు చేపట్టారు.
టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో రెండు రోజులపాటు 100 మంది అలంకరణ నిపుణులు, మరో 100 మంది టీటీడీ సిబ్బంది ఇందుకోసం పనిచేశారు.
Tags: The wedding venue’s artistic creations evoked the grandeur of Ayodhya.