గంజాయి అక్రమ రవాణాపై అనకాపల్లి జిల్లా పోలీసుల ఉక్కుపాదం
రూ. 1.33 కోట్ల విలువైన 230 కేజీల గంజాయి, కార్లు, బైకులు మరియు నగదు స్వాధీనం
పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు
నర్సీపట్నం ముచ్చట్లు:
నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఘటన వివరాలు:
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మరియు నర్సీపట్నం ఎస్డీపీఓ (SDPO) పి.శ్రీనివాస రావు కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) ఎల్.రేవతమ్మ గారు, ఎస్సై (SI) పి.రాజారావు మరియు వారి పోలీస్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
19-10-2026 తేదీ ఉదయం సుమారు 07:30 గంటల సమయంలో, నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ శివారు అడ్డదారుల్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా వస్తున్న ఒక ఎర్టిగా కారు మరియు దానికి పైలట్లుగా ఉన్న రెండు మోటార్ సైకిళ్లను అడ్డుకున్నారు.
పోలీసుల తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 230 కేజీల గంజాయిని గుర్తించి, తరలిస్తున్న ఐదుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 71/2026 u/s 20(b)(ii)(C), 25 r/w 8(C) NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు.
పట్టుబడిన నిందితుల వివరాలు:
శశి కుమార్ (52), తండ్రి: దొరయికన్ను, వృత్తి: డ్రైవర్, అన్నై సేవకామి నగర్, రామనాథపురం, తంజావూరు *జిల్లా,
తమిళనాడు (A-1).
పాంగి సుబ్బారావు @ చందు (21), తండ్రి: దుంబ్రి, కులం: ST-PTG, కిల్లంకోట పంచాయతీ, జి. మాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా (A-2).
వంతల చంటి బాబు (27), తండ్రి: బిర్సు, కులం: ST-PTG, అన్నవరం కాలనీ, చింతపల్లి మండలం, ASR జిల్లా (A-3).
అమల రాజ్ (36), తండ్రి: ఇషిటోర్, వృత్తి: చేపల వేట, వెరూర్ గ్రామం, తమిళనాడు (A-4).
మణికందన్ చంద్రకుమార్ @ రాహుల్ (22), తండ్రి: చంద్రకుమార్, శ్రీలంక శరణార్థుల శిబిరం (Refugee Camp), మరక్కాణం, విల్లుపురం జిల్లా, తమిళనాడు (A-5).
నేర నేపథ్యం – రవాణా తీరు: A-1 (శశికుమార్) తమిళనాడుకు చెందిన ప్రధాన గంజాయి వ్యాపారి. ఏపీలోని ఏజెన్సీ మరియు ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నై, కోయంబత్తూరు, తంజావూరులతో పాటు శ్రీలంకకు తరలించి చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ భారీ లాభాలు గడించేవాడు.
2024లో పుదుక్కోట్టై జిల్లా జైలులో A-1, A-3 (చంటిబాబు)లకు పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ సంప్రదించుకున్నారు.
A-3 తన స్నేహితుడైన A-2 (పాంగి సుబ్బారావు)తో కలిసి ఒడిశాలోని జంతాపాయి గ్రామంలో కిలో రూ.5,000/- చొప్పున 230 కేజీల గంజాయిని కొనుగోలు చేసి జి.మాడుగుల మండలం అలగం గ్రామంలో దాచారు.
అనంతరం A-1 తన అనుచరులైన A-4, A-5 లతో కలిసి పుదుచ్చేరి రిజిస్ట్రేషన్ గల ఎర్టిగా కారులో వచ్చి గంజాయిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
19-10-2026 తెల్లవారుజామున 10 ప్లాస్టిక్ గోనె సంచులలో నింపిన 230 కేజీల గంజాయిని ఎర్టిగా కారులో పెట్టుకుని, పోలీసుల నిఘా తప్పించేందుకు ముందుగా రెండు మోటార్ సైకిళ్లతో పైలటింగ్ చేస్తూ వస్తుండగా గబ్బాడ గ్రామ శివార్లలో పోలీసులు పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు (మొత్తం విలువ: సుమారు రూ.1,33,70,000/-):
గంజాయి: సుమారు 230 కేజీలు (విలువ రూ. 1,15,00,000/-)
ఎర్టిగా కారు: PY02 S 0227 (విలువ రూ. 13,00,000/-)
బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్: AP31 EH 7988 (విలువ రూ. 1,00,000/-)
యమహా MT-15 మోటార్ సైకిల్: AP39 BL 8859 (విలువ రూ. 1,00,000/-)
మొబైల్ ఫోన్లు: 5 (విలువ రూ. 2,50,000/-)
నగదు: రూ.1,20,000/-
సిబ్బందికి ప్రశంసలు:
ఈ దాడిలో ప్రతిభ కనబరిచిన నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్సై పి.రాజారావు, ఎస్సై పి.రామారావు, ఎస్సై వి.రిషికేశ్వరరావులతో పాటు హెడ్ కానిస్టేబుల్ కొండబాబు, కానిస్టేబుళ్లు నవీన్, శివ, సాయి, ఆదినారాయణ, స్పెషల్ పార్టీ పీసీలు చిన్నారావు, సంతోష్ మరియు హోంగార్డులు రాము, దేవేంద్రలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ గారు హెచ్చరించారు.
Tags:Interstate gang arrested