September 15, 2026
Explore
చంద్రరావుకు సాహసోపేత సేవలకు గుర్తింపుగా నగదు రివార్డు

చంద్రరావుకు సాహసోపేత సేవలకు గుర్తింపుగా నగదు రివార్డు

September 15, 2026 | Andhra Pradesh

రైలు ప్రమాదంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందనలు

సాహసోపేత సేవలకు గుర్తింపుగా నగదు రివార్డు, ప్రశంసా పత్రం అందజేత

​”యూనిఫాంలో ఉన్నా లేకున్నా ప్రజల ప్రాణరక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యం” – జిల్లా ఎస్పీ

అనకాపల్లి ముచ్చట్లు:

తుని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కిందపడి తీవ్ర గాయాలపాలై పట్టాల మధ్య చిక్కుకుపోయిన ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి రక్షించిన ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం.చంద్రరావు (HC-496) సాహసాన్ని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ప్రత్యేకంగా కొనియాడారు.
​మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రరావును ఎస్పీ స్వయంగా అభినందించి, ఆయన చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలకు గుర్తింపుగా ప్రశంసా పత్రం మరియు నగదు రివార్డును అందజేశారు.

​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ”విపత్కర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించి అమూల్యమైన మానవ ప్రాణాన్ని కాపాడటం అత్యంత అభినందనీయం. ప్రమాదం జరిగిన సమయంలో చుట్టూ ఉన్నవారు వీడియోలు తీయడానికే ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు ఏమాత్రం సంకోచించకుండా రైలు కిందకు వెళ్లి బాధితుడిని సురక్షితంగా బయటకు తీయడం ఆయనలోని అంకితభావానికి, మానవత్వానికి నిదర్శనం. యూనిఫాంలో ఉన్నా లేకపోయినా, డ్యూటీలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ప్రజల ప్రాణాలను కాపాడటమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని చంద్రరావు రుజువు చేశారు. ఆయన చూపిన తెగువ జిల్లా పోలీసు శాఖకే గర్వకారణం. ఇలాంటి నిస్వార్థ సేవలు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో గౌరవాన్ని, నమ్మకాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి” అని పేర్కొన్నారు. సిబ్బంది అందరూ ఇలాంటి సేవాభావాన్ని, కర్తవ్య నిష్ఠను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ సూచించారు.​ఈ కార్యక్రమంలో ఎలమంచిలి రూరల్ ఎస్సై ఎం.ఉపేంద్ర మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Tags:Cash reward for Chandra Rao in recognition of his courageous service.