అమరావతిముచ్చట్లు:
- బీసీల గురించి గంటలు మాట్లాడి.. ‘బీసీ రక్షణ చట్టం’పై నోరెందుకు మెదపరు?
- జనాభా దామాషా అడిగితే.. 45 ఏళ్లుగా తమాషాలు చేస్తున్న చంద్రబాబు
- మురళీధరన్ కమిషన్ చెప్పిన 44 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయి?
- 34 శాతానికి శాస్త్రీయత ఏంటి? ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు?
- 44 శాతం రిజర్వేషన్ల డిమాండ్ విషయంలో బిసివై పార్టీ వెనకడుగు వేయదు
- 33 శాతం రిజర్వేషన్ల ప్రకటనకు కారణం బిసివై పార్టీ పోరాటమే
- స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బీసీలు తగిన బుద్ధి చెబుతారు
- బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనడం బీసీలను దొంగదెబ్బ తీసే కుట్ర అని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అడుగుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 45 ఏళ్లుగా బీసీలతో తమాషాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో బీసీల జనాభా 55 నుంచి 60 శాతానికి పైగా ఉంటే, కేవలం 50 శాతం మాత్రమే ఉన్నారని తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వం మోసం చేసే ప్రయత్నం చేస్తోందని రామచంద్రయాదవ్ ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఏ శాస్త్రీయత ఆధారంగా, ఏ ప్రాతిపదికన 34 శాతం రిజర్వేషన్లు ఇస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల క్రితం మురళీధరన్ కమిషన్ సిఫార్సు చేసిన 44 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గత రెండేళ్లుగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం 34 శాతం ఇచ్చి బీసీలను ఉద్ధరించేసినట్లు బిల్డప్ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.
ఈరోజు బీసీల గురించి గంటల తరబడి గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి, బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టే “బీసీ రక్షణ చట్టం” గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని రామచంద్రయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించే చట్టంపై నోరు మెదపకుండా, కేవలం ఓట్ల కోసమే బీసీల జపం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీసీల రక్షణ గురించి మాట్లాడని నాయకులకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
గత 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ బీసీలను వంచిస్తూనే ఉందని, చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అదే మోసాన్ని కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలకు తీరని ద్రోహం చేస్తూ, వారిని వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును.. బీసీ ప్రజాప్రతినిధులు వెళ్లి సన్మానించడం అత్యంత సిగ్గుచేటని రామచంద్రయాదవ్ తీవ్రంగా ఖండించారు. తమ జాతికి ద్రోహం చేసిన వ్యక్తికి సన్మానాలు చేయడం బీసీ సమాజాన్ని అవమానించడమేనన్నారు.
34 శాతం రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఈ మోసాన్ని నమ్మి మోసపోవడానికి బీసీ సమాజం ఇక ఏమాత్రం సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంలో టీడీపీ చేస్తున్న కుట్రలకు, మోసాలకు రాబోయే ఎన్నికల్లో బీసీలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని బోడె రామచంద్రయాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Tags: The 34% reservation for BCs is a conspiracy; it is shameful to felicitate Babu, who deceived them!