March 25, 2026
Explore
ఆ మలుపులు మృత్యువుకు పిలుపులు

ఆ మలుపులు మృత్యువుకు పిలుపులు

March 25, 2026 | Andhra Pradesh

-రోడ్డుపై కనిపించని ప్రమాద సూచికలు

  • అతివేగంతోనే ప్రాణాలు గాలిలోకి

పుంగనూరుముచ్చట్లు:

జాతీయ రహదారులపై మలుపులు మృత్యుమార్గాలుగా మారుతున్నాయి. పుంగనూరు బైపాస్‌ రోడ్డు జాతీయ రహదారిపై తరచు ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుతున్నాయి. ప్రమాదాలకు ముఖ్యకారణం అతివేగం. మధ్యం మత్తు, నిద్రలో వాహనాలు నడపడం, యువకులు స్టంట్లు చేయడం మూలంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మండలంలోని గూడూరుపల్లె సమీపంలోను, జెన్యూటౌన్‌ వద్ద , రాంపల్లె వద్ద గల శ్రీకృష్ణదేవరాయ విగ్రహం మలుపు, లక్కుంట, రాగానిపల్లె సర్కిల్‌ సమీపంలో మూలమలుపుల ప్రమాదకరంగా ఉన్నాయి.

ప్రాణాలను హరిస్తున్న అతివేగం….

పుంగనూరు బైపాస్‌ రోడ్డులో ప్రమాదాలు జరిగిన తీరును చూస్తే రహదారిపై సూచిక బోర్డులు లేకపోవడం, అతివేగమే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా మండలంలోని కృష్ణదేవరాయసర్కిల్‌ వద్ద గత నెలలో మూడు ప్రమాదాలు జరిగి ఇద్దరు మృత్యువాతపడ్డారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మండలంలోని లక్కుంట వద్ద గుడిసెబండకు చెందిన వెంకట్రమణ కుమారుడు సోమశేఖర్‌(26) గత సంవత్సరం డిసెంబర్‌ 30న ఆర్టీసి క్రింద పడి మృత్యువాత పడ్డాడు. అలాగే గూడూరుపల్లె సమీపంలోని మలుపులో రెండు ఆర్టీసి బస్సులు ఢీకొనడంతో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే పెద్దపంజాణి మండలం షాపూర్‌ గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా కుమారుడు జమీర్‌(24) ద్విచక్రవాహనంపై పంజాణికి వెళ్తుండగా ఇచర్‌ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో జమీర్‌ మృతిచెందాడు. నారాయణ అనే వ్యక్తి అదుపుతప్పి పడి మృతి చెందాడు. అరబిక్‌ కళాశాల మలుపు వద్ద ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసులును ఆర్టీసి బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఇలా ఎన్నో ప్రమాదాలు సంభవించి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు క్షతగాత్రులు కావడంతో వారి కుటుంభాలు వీధిన పడుతున్నాయి.

ట్రాఫిక్‌ పోలీస్‌ను నియమించాలి….

జాతీయ రహదారులపై ఉన్న సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులను నియమించి, సిగ్నిల్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే వాహనదారులకు సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన పక్షంలో ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి…..

జాతీయ రహదారిపై ప్రమాదాలు కలచివేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన మలుపుల వద్ద బోర్డులు, డివైడర్లు సొంత నిధులతో ఏర్పాటు చేశాం. వాహనదారులు రహదారి పై అవగాహనతో మితిమీరిన వేగంతో ప్రయాణించకుండ ప్రమాదాలను నివారించాలి. ప్రజల్లో అవగాహన రావాలి.

  • కొత్తపల్లె చెంగారెడ్డి, వైఎస్సార్‌సిపి జిల్లా యూత్‌వింగ్‌ కన్వీనర్‌.

అతివేగమే ప్రమాదం……

బైపాస్‌ రోడ్డులో ప్రమాదాలకు మితిమీరిన వేగమే కారణమౌతోంది. మధ్యం సేవించి నడపడం, లేదా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నడపడంతో మృత్యువాత పడుతు తల్లిదండ్రులను, కుటుంభాన్ని వీధులపాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నిదానమే ప్రదానం అనే నినాదంతో ప్రయాణించండి.

  • అమరావతి సురేష్‌, లయన్స్ క్లబ్‌ మెంబరు.

Tags: Those turns are calls to death.