March 24, 2026
Explore
ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

March 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

– రామనామ స్మరణతో మార్మోగిన ఆలయం

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

కంకణబట్టార్ శ్రీ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి 8.50 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణ, రామనామ జపాల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు.

ఈ ధ్వజారోహణం ద్వారా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు సమాజ శ్రేయస్సు, వంశాభివృద్ధి కలగాలని అర్చకులు తెలిపారు.

అంతకుముందు ఉదయం 4 గంటలకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటల నుంచి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, అలంకరణ, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

ధ్వజారోహణం అనంతరం ఉదయం 9 గంటలకు భేరి తాడనం, దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు గజ వాహన సేవ జరగనుంది.

ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఏఈవో గోపినాథ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: The annual Brahmotsavams of Sri Pattabhiramaswamy commenced with the Dhwajarohanam ceremony.