March 24, 2026
Explore
పసిడి పతనం.. 1983 నాటి సీన్‌ రిపీట్‌

పసిడి పతనం.. 1983 నాటి సీన్‌ రిపీట్‌

March 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది.

అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో ఔన్స్‌ బంగారం ధర 4,500 డాలర్ల దిగువకు పడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది.

కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.47 శాతం క్షీణించి, ఔన్స్‌కు 4,492 డాలర్ల వద్ద ట్రేడయింది. బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 5 శాతం పతనమై ఔన్స్‌కు 70 డాలర్ల దిగువకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం 119 డాలర్ల వద్ద ఉన్న వెండి.. ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేసింది.

పతనానికి ప్రధాన కారణాలు
సాధారణంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుత ఇరాన్-యుఎస్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు తగ్గడానికి ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి.

బలమైన డాలర్: అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం బంగారంపై ఒత్తిడి పెంచింది.

ద్రవ్యోల్బణం & చమురు: పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇతర వస్తువుల డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి.

ప్రాఫిట్ బుకింగ్: గత కొంతకాలంగా భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు (Pull-back) మొగ్గు చూపుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి.

1983లో ఏం జరిగిందంటే..
1979-80 మధ్య ఇరాన్ విప్లవం, చమురు సంక్షోభం కారణంగా బంగారం ధర అప్పట్లో 850 డాలర్లకు ఎగబాకింది. అయితే 1983లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ధరలు 15-20 శాతం పతనమై 375-400 డాలర్లకు పడిపోయాయి. అప్పట్లో పాల్ వోకర్ వడ్డీ రేట్లను పెంచి డాలర్‌ను బలోపేతం చేయడమే ఇందుకు కారణం. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ఆర్థిక పరిణామాలే కనిపిస్తుండటంతో, పసిడి మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తోంది.

Tags: Gold Plummets… 1983 Scenario Repeats