July 1, 2026
Explore
అన్నమయ్య జిల్లా బోర్డులో మదనపల్లె పేరు కనుమరుగు

అన్నమయ్య జిల్లా బోర్డులో మదనపల్లె పేరు కనుమరుగు

July 1, 2026 | Andhra Pradesh

-ఉద్దేశపూర్వకంగానే తొలగించారని ప్రజల ఆగ్రహం
-జిల్లా కేంద్రమైనా గుర్తింపు లేకుండా చేస్తున్నారని విమర్శలు

మదనపల్లె టౌన్ ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ బోర్డులో ఉద్దేశపూర్వకంగా మదనపల్లె పేరు లేకుండా తొలగించి కనుమరుగయ్యేలా చేశారని మదనపల్లె ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రాయచోటిలో ఉన్న అన్నమయ్య జిల్లాను సీఎం చంద్రబాబు నాయుడు హామీ మేరకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా మార్చారు. అయితే ప్రస్తుతం కలెక్టరేట్‌తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై కేవలం ‘అన్నమయ్య జిల్లా’ అని మాత్రమే ఉండి, జిల్లా కేంద్రమైన ‘మదనపల్లె’ పేరు కనుమరుగైందని స్థానికులు మండిపడుతున్నారు. “జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించిన తర్వాత అన్ని బోర్డులపై ‘అన్నమయ్య జిల్లా, మదనపల్లె’ అని ఉండాలి. కానీ అధికారులు ఉద్దేశపూర్వకంగా మదనపల్లె పేరును తొలగించి కేవలం అన్నమయ్య జిల్లాగానే చూపుతున్నారు. దీంతో మదనపల్లె గుర్తింపు మరుగున పడుతోంది” అని పట్టణ ప్రముఖులు విమర్శిస్తున్నారు.చారిత్రక ప్రాశస్త్యం, విద్యా, వాణిజ్య రంగాల్లో ప్రాధాన్యత ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రం చేసినా, అధికారికంగా గుర్తింపు ఇవ్వకుండా పేరును కనుమరుగు చేస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై ‘అన్నమయ్య జిల్లా, మదనపల్లె’ లేకుంటే మదనపల్లె జిల్లా (అన్నమయ్య) అని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags: Madanapalle’s name disappears from the Annamayya District Board.