రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ శాఖ చేపడుతున్న “క్లీన్ స్వీప్” ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
శుక్రవారం రాయచోటి ఎస్.ఎన్. కాలనీలోని సాయిబాబా వీధిలో నిర్వహిస్తున్న క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తదితర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలు, డ్రైనేజీల శుభ్రపరిచే పనులను తనిఖీ చేసి, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, తడి మరియు పొడి చెత్తను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలు కూడా తమ ఇళ్లలోనే చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు.
రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం పూర్తిగా మానుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పరిశుభ్రత పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
గత 40 రోజులుగా రాయచోటి పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 122 కిలోమీటర్ల డ్రైనేజీల్లో 95 కిలోమీటర్ల మేర పూడికతీత, శుభ్రపరిచే పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి వర్షాకాలానికి ముందే డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువజన సంఘాలు, వాకర్స్ అసోసియేషన్లు తదితరులను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు.
పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి అత్యంత అవసరమని కలెక్టర్ అన్నారు. “పరిశుభ్రమైన రాయచోటి – ఆరోగ్యకరమైన రాయచోటి” నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను నిర్లక్ష్యంగా వేస్తున్న షాపులు, హోటళ్లు, గృహ యజమానులకు ముందుగా అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేస్తామని తెలిపారు. అయినప్పటికీ మార్పు రాకపోతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరిమానాలు విధించడం లేదా అవసరమైతే దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలులో జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, ప్రతి పౌరుడు పరిశుభ్రత ఉద్యమంలో భాగస్వామి కావాలని కోరారు. ప్రజల సహకారంతో రాయచోటిని ఆదర్శ పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags: “Building a Clean Rayachoti is the Goal” – District Collector Nishant Kumar